No Mask : తెలంగాణలో ఎన్ని కేసులో తెలుసా

  • Publish Date - July 2, 2020 / 09:13 AM IST

కరోనా వైరస్ నుంచి కాపాడుకొండి..అత్యవసరమైతే తప్ప..బయటకు రాకండి.. బయటకు వచ్చినా..తప్పనిసరిగా ముఖానికి Mask ధరించండి. బయట తిరిగే సమయంలో మాస్క్ తీయకండి. Mask ధరించడం వల్ల నోటి, ముక్కులోకి వైరస్ వెళ్లదు. మీ జాగ్రత్తే..శ్రీరామరక్ష అంటున్నాయి ప్రభుత్వాలు. వైద్యులు, నిపుణులు కూడా ఇదే విధంగా సూచిస్తున్నారు.

కానీ కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. వీరికి బుద్ధి చెప్పేందుకు, ధరించని వారికి భయం కలిగే విధంగా చేయడానికి ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. Mask ధరించని వారికి ఫైన్ వేస్తున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా Mask ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తోంది సీఎం కేసీఆర్ సర్కార్.

చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ తెలంగాణ రాష్ట్రాన్ని కమ్మేస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బయటకు వచ్చే వారు తప్పనిసరిగా Mask ధరించాలని, లేనిపక్షంలో జరిమాన, కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. కొంతమంది బేఖాతర్ చేస్తుండడంతో వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్చి 22వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 29 పోలీస్ యూనిట్ల పరిధిలో 67 వేల 557 మందిపై పోలీసులు ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. మరో 3 వేల 288 మందికి ఈ చలాన్లు జారీ చేశారు.

హైదరాబాద్ లో అత్యధికంగా 14 వేల 931 కేసులతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో 8 వేల 290, ఖమ్మంలో 6 వేల 372, సూర్యాపేట 4 వేల 213, వరంగల్ లో 3 వేల 907, జయశంకర్ భూపాలపల్లి 173 మందిపై కేసులు నమోదు చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 17,357కి చేరింది. రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వ‌హించగా 1,018 పాజిటివ్ కేసులు వచ్చాయి.

కరోనా నుంచి 788 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,082గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 2020, జులై 01వ తేదీ బుధవారం కరోనాతో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 267కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 881 మంది వైరస్ బారిన పడ్డారు.

మేడ్చల్ 36, రంగారెడ్డి 33, మహబూబ్ నగర్ 10, వరంగల్ రూరల్ 9, మంచిర్యాల 9, ఖమ్మం 7, నల్గొండ 4, జగిత్యాల 4, సిద్దిపేట 3, నిజామాబాద్ 3, ములుగు 2, అసిఫాబాద్ 2, కామారెడ్డి 2, మెదక్ 2, ఆదిలాబాద్ 2, యాదాద్రి భువనగిరి 2, సంగారెడ్డి 2, కరీంనగర్ 2, సూర్యాపేట 2, గద్వాల 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Read:కరోనాపై ఏం చేద్దాం : హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారా