Noorjahan Mangoes : ఈ నూర్జహాన్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక్కటి రూ.1000.. పూత దశలోనే బుకింగ్

నూర్జహాన్ అంటే ఎవరో అని కంగారు వద్దు. అదో రకం మామిడి. ఈ రకానికి చెందిన ఒక్క మామిడి పండు ధర అక్షరాల వెయ్యి రూపాయలు.

Noorjahan Mangoes

Noorjahan Mangoes : నూర్జహాన్ ఏంటి.. ఒక్కటి వెయ్యి రూపాయలు ఏంటి.. మ్యాటర్ ఏంటి? అని కంగారు వద్దు. అదో రకం మామిడి. ఈ రకానికి చెందిన ఒక్క మామిడి పండు ధర అక్షరాల వెయ్యి రూపాయలు. ఏంటి షాక్ అయ్యారా? నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. ఎక్కడో తెలుసా. మధ్యప్రదేశ్‌లోని అలీరాజాపూర్‌ జిల్లాలో. అక్కడ లభించే ‘నూర్జహాన్’ వెరైటీకి చాలా డిమాండ్ ఉంది. పూత దశలో ఉండగానే.. అనేక మంది వీటిని బుక్‌ చేసుకుంటారంటే.. దానికున్న క్రేజ్‌ ఏంటో అర్థమవుతుంది.

స్థానికులు ‘నూర్జహాన్’గా పిలిచే ఈ మామిడి పండు ఒక్కోటి 500 నుంచి 1000 రూపాయల దాకా పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడి బాగా ఉండడంతో పాటుగా పండు సైజు కూడా పెద్దదిగా ఉండడమే ఇంత ధర పలకడానికి కారణమట. ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతానికి చెందిన ఈ నూర్జహాన్ మామిడిని గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లా కత్తివాడ ప్రాంతంలో మాత్రమే సాగు చేస్తారు.

ఈసారి వాతావరణం అనుకూలించడంలో దిగుబడి బాగా వచ్చిందని నూర్జహాన్‌ను పండించే రైతులు చెబుతున్నారు. ఒక్కో కాయ మూడు కిలోల వరకు తూగుతున్నట్లు తెలిపారు. గత ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక్కో పండు బరువు 2.5 కిలోల వరకే పరిమితమైనట్లు రైతులు తెలిపారు. పైగా కరోనా ప్రభావంతో 2020 వేసవిలో పెద్దగా డబ్బులేమీ రాలేదని వాపోయారు. కానీ, ఈసారి మాత్రం మార్కెట్‌లో నూర్జహాన్‌ పండుకు మంచి డిమాండ్‌ ఉన్నట్లు రైతులు తెలిపారు. ఒక్కో పండును రూ.1000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో దీని ధర రూ.1,200 వరకు పలకడం గమనార్హం.

జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూతకు పూస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయి. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగు మేర పొడువు ఉంటాయి.