పెళ్లి పేరుతో రూ.3 కోట్లు కొట్టేసిన మాయలేడి

  • Publish Date - July 17, 2020 / 12:06 PM IST

మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి విదేశాల్లో ఉన్న వరుల నుంచి డబ్బులు కొట్టేసిన మహిళ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆ మహిళ ఇదే విధంగా ఇప్పటికి పలువుర్ని మోసగించింది. గతంలో 4సార్లు అరెస్టైనా తీరు మార్చుకోలేదు.

వీరిపై హైదరాబాద్ లో మారేడ్ పల్లి, నల్లకుంట, జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. రెండునెలల క్రితం జూబ్లీ హిల్స్ పోలీసులు ఈమెను, ఈమె కుమారుడిని అరెస్టు చేశారు. ఇప్పడు కొత్తగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది.

హబ్సిగూడకు చెందిన సత్యనారాయణరావు కుమారుడు సుధీర్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు‌. సుధీర్ వివాహం చేసుకునే ఉద్దేశంతో మంచి సంబంధం కోసం తెలుగు మాట్రిమోనీ సైట్‌లో 2016 లో తన వివరాలు రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ ప్రొఫైల్‌ చూసిన నగరానికి చెందిన ఓ యువతి డాక్టర్‌ నియతి వర్మగా పరిచయం చేసుకుని ఇంట్రెస్ట్ మెసేజ్ పంపించింది.

సుధీర్‌ ప్రొఫైల్‌లోని ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి తాను అతడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పింది. ఈ ఫోన్‌ నంబర్‌ సుధీర్ తండ్రి సత్యనారాయణ వద్ద ఉండటంతో ఆయన విషయాన్ని అమెరికాలోని తన కుమారుడికి తెలిపి యువతి ఫోన్‌ నంబర్‌ను కూడా అతడికి పంపాడు.

సుధీర్ నియతి వర్మతో మాట్లాడానికి ఫోన్ చేయగా తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పల్మనాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసినట్లు నియతి వర్మ చెప్పింది. ఈమె ప్రొఫైల్‌ నచ్చడంతో సుధీర్‌ కొన్నాళ్లు ఆమెతో మాటలు, చాటింగ్స్‌ కొనసాగించాడు.

ఈ సమయంలోనే నియతి వర్మగా చెప్పుకున్న యువతి తాను చాలా స్థితి మంతురాలినని…. తనకు ఉన్న ఆస్తులు వారసత్వ గొడవల్లో ఉన్నాయని, మనశ్శాంతి కోసం తాను ఓ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పింది. దాని నిర్వహణ కోసం నిధులు అవసరమని చెప్పి.. 2016 నుంచి విడతల వారీగా అతడి వద్ద నుంచి రూ.3 కోట్లు బదిలీ చేయించుకుంది.

ఆ తర్వాత రెండుమూడు సందర్భాల్లో పెళ్లి విషయం నియతి వర్మ కుటుంబీకులుగా చెప్పుకున్న వాళ్లూ సత్యనారాయణతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే దాటవేయడం మొదలెట్టారు.

అనుమానం వచ్చిన సత్యనారాయణ ఆరా తీయగా తమతో నియతి వర్మగా మాట్లాడిన మహిళ దేవతి మాళవిక గా గుర్తించారు. విషయం సత్యనారాయణకు తెలిసి పోయిందని గ్రహించిన మాళవిక కుటుంబ సభ్యులు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు.

మాళవిక తన భర్త, కొడుకు, అత్తమామలతో కలిసి తమను మోసగించిందని తెలుసుకున్న ఆయన గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. అధికారులు రీ-రిజిష్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.