Osama bin Laden ప్రపంచాన్ని వణికించిన అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు అండగా ఉండేవారని మరియు షరీఫ్ కు ఆర్థిక సాయం కూడా లాడెన్ అందిస్తుండేవాడని అమెరికాలో పాక్ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్ తాజాగా బయటపెట్టారు. నవాజ్ షరీఫ్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేసిన సయీదా అబిదా హుస్సేన్..తాజాగా కొన్ని సీక్రెట్ లను బయటపెట్టారు.
ప్రైవేట్ న్యూస్ చానెల్ జీయో టీవీ ఇంటర్వ్యూలో సయీదా అబిదా హుస్సేన్ మాట్లాడుతూ…అవును, లాడెన్ ఒక విషయంలో నవాజ్ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్ షరీఫ్‌కు లాడెన్ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడని స్పష్టం చేశారు. బిన్ లాడెన్ ఒకప్పుడు చాలా పాపులర్ వ్యక్తి అని,అందరూ ఆయనను ఇష్టపడేవారని..అమెరికన్లు కూడా మొదట్లో ఆయనను ఇష్టపడేవారని..అయితే తర్వాతి కాలంలో ఆయనను ఒక అపరిచితుడిగా ట్రీట్ చేశారని అబిదా పేర్కొన్నారు.
కాగా, గతంలో నవాజ్ షరీఫ్…అవిశ్వాస తీర్మాణం ద్వారా బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేందుకు పాకిస్తాన్ లో విదేశీ నిధులకు ఫౌండేషన్ వేశారని మరియు బిన్ లాడెన్ నుంచి 10మిలియన్ డాలర్లు తీసుకున్నారని పీటీఐ(Pakistan Tehreek-e-Insaf)ఎంపీ ఫారూఖ్ హబిబ్ కొద్ది రోజుల కిత్రం తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా షరీఫ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన అబిదా హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
పాకిస్తాన్ కు మూడు సార్లు(1990-93, 1997-98, 2013-17)ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్..కశ్మీర్ లో జీహాద్ ని ప్రమోట్ చేసేందుకు మరియు జీహాద్ కు ఫండ్ సమకూర్చేందుకు బిన్ లాడెన్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్ నుంచి నవాజ్ షరీఫ్ డబ్బులు తీసుకున్నారని ఆ దేశ సీక్రెట్ ఏజెంట్ సంస్థ ఐఎస్ఐ మాజీ ఉద్యోగి భార్య 2016లో రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ మాజీ అధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామ ఖలీద్ ‘ఖలీద్ ఖవాజా: షాహీద్-ఐ-అమాన్’అనే పుస్తకం రచించారు. పాకిస్తాన్ లో బెనజీర్ భుట్టో కుటుంబ రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలనే లక్ష్యంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు లాడెన్ నుంచి నవాజ్ షరీఫ్ భారీ ఎత్తున డబ్బు తీసుకున్నాడని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆల్ ఖైదా అందజేసిన డబ్బుతోనే నవాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చాడని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు.
కాగా, బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ బృందం 2011 మేలో పాకిస్తాన్ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక, 2017లో అవినీతి కేసుల నేపథ్యంలో ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ప్రస్తుతం ఫరీష్ లండన్ లో ఉంటున్నారు.