Over 24000 Abortion Kits Seized In Rajasthan
Rajasthan: గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో 24 వేలకు పైగా అబార్షన్ కిట్లను ఎఫ్‌డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తుండగా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన పింటూ షా బనస్కాంతా.. దీసాలోని వినోద్ మహేశ్వరీ, లోకేశ్ మహేశ్వరీల నుంచి అబార్షన్ కిట్లను కొనుగోలు చేసి ఆన్లైన్ వేదికగా ఈ కిట్లను విక్రయించేవాడు.
గత ఏడాదిన్నర కాలంలో ఓ ఆన్లైన్ వేదికగా ఇప్పటివరకు 800 అబార్షన్ కిట్లను విక్రయించాడు. నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండగా ఎఫ్‌డీసీఏ అధికారులు దాడులు నిర్వహించి ఈ గుట్టువిప్పారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్లను ఫోర్జరీ చేసి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఓ ముంబయి మార్కెటింగ్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా చేస్తున్న రాజేశ్ యాదవ్ అనే వ్యక్తి నుండి జావేరీ సంగ్లా అనే నిందితుడు ఈ ఫోర్జరీ ప్రిస్క్రిప్షన్లను సేకరించి ఈ కిట్లను విక్రయించేవారు.
ముంబయికి చెందిన ఓ సంస్థలో మార్కెటింగ్ ప్రతినిధిగా పనిచేస్తున్న నీలయ్ వోర, విపుల్ పటేల్, మోనిశ్ పంచల్ అనే వారి నుంచి 700 కిట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుషార్ ఠక్కర్ అనే మరో నిందితుడి నుంచి ఆక్సిటాక్సిన్ ఇన్జెక్షన్లకు చెందిన మూడు లక్షల వయల్స్ సహా వివిధ ఇన్జెక్షన్లు, మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఇన్జెక్షన్లను వడోదరాలోని ఎఫ్‌డీసీఏ ల్యాబ్‌కు తరలించగా ఈ డ్రగ్స్‌ను రాజస్థాన్ నుంచి తెచ్చినట్లు సమాచారం అందడంతో అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నారు.