వామ్మో..కరోనా..తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు

  • Publish Date - June 1, 2020 / 12:20 AM IST

తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2020, మే 31వ తేదీ ఆదివారం ఒక్కరోజే కొత్తగా రికార్డు స్థాయిలో  199మంది కరోనా బారినపడ్డారు. తెలంగాణలో ఒక్కరోజు ఇన్ని కేసులు నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

ఆదివారం నమోదైన 199 కేసుల్లో… 122 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయి.  మరో 40 కేసులు రంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యాయి.  మేడ్చల్‌ జిల్లాలో 10,ఖమ్మంలో 9,మహబూబ్‌నగర్‌, మెదక్‌, జగిత్యాలలో మూడు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. వరంగల్‌ అర్బన్‌లో రెండు, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదు అయ్యాయి. ఇక ముగ్గురు వలస దారులకూ వైరస్‌ సోకింది.

తెలంగాణలో నిన్న నమోదైన  కేసులతో కలిపి మొత్తం  కేసుల సంఖ్య 2,698కి చేరింది. ఇందులో 1428 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 1188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు తెలంగాణలో 82 మంది చనిపోయారు.

వరుసగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులతో హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ హాట్‌స్పాట్‌గా మారింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 51 కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ప్రాంతంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ సంస్థల ప్రతినిధులు జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మినార్‌ కాలనీలో శని, ఆదివారాలలో వంద మంది నుంచి రక్తనమూనాలు సేకరించారు. చెన్నైలోని ల్యాబ్‌కు తీసుకెళ్లి వాటిని పరీక్షించనున్నారు.