Pakistan Air Force : శ్రీనగర్ కి 100 కి.మీ దూరంలో 2 పాక్ ఎయిర్ బేస్ లు

భార‌త స‌రిహ‌ద్దుకు అత్యంత స‌మీపంలో ఉన్న త‌న రెండు ఎయిర్ బేస్ ల‌ను పాకిస్తాన్ పున‌రుద్ధ‌రించింది.

Ka5

Pakistan Air Force  భార‌త స‌రిహ‌ద్దుకు అత్యంత స‌మీపంలో ఉన్న త‌న రెండు ఎయిర్ బేస్ ల‌ను పాకిస్తాన్ పున‌రుద్ధ‌రించింది. నియంత్రణ రేఖ (LOC)కి సమీపంలోని ఉన్న ఈ రెండు ఎయిర్‌బేస్‌లు శ్రీనగర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

శ్రీన‌గ‌ర్ కు కేవ‌లం 100కి. మీ స‌మీపంలో ఉన్న ఈ ఎయిర్ బేస్ లు(పాక్‌ ఆక్రమిక కశ్మీర్‌లోని కోట్లి, రావల్‌కోట్‌) చాలా కాలంగా మూసివేసి ఉన్నాయి. అయితే 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రస్థావరాలపై భార‌త్ మెరుపు దాడులు చేసింది.  ఆ త‌ర్వాత మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పాక్ ఆక్ర‌మిత కశ్మీర్ లో చాలా కాలంగా వినియోగంలో లేని కోట్లి, రావల్‌కోట్‌ ఎయిర్ బేస్ ల‌ను పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తిరిగి తెరిచినట్లు సమాచారం.

పాకిస్థాన్ ఆర్మీ 23 డివిజన్‌లో భాగమైన 3 POK బ్రిగేడ్ ప్రాంతంలో కోట్లీ ఎయిర్ బేస్ ఉన్నది. ఇటీవల వందకు పైగా వాయు రక్షణ దళాలను ఇక్కడకు తరలించారు. ఇక,రావల్‌కోట్ ఎయిర్ బేస్.. పాక్‌ ఆర్మీ 12 డివిజన్‌కు చెందిన 2 POK బ్రిగేడ్ కిందకు వస్తుంది. నాలుగేళ్ల కిందట మూసివేసిన ఈ ఎయిర్ బేస్‌ను పాకిస్తాన్ తిరిగి తెరిచింది.  ఇక్కడ ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పాక్ మోహరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

మరోవైపు,బ‌లూచిస్తాన్ లోని ఎయిర్ బేస్ ను సైతం పాక్ బ‌లోపేతం చేస్తుంద‌ని…సింధులోని జాకబాబాద్‌ పీఏఎఫ్‌ స్థావరం సమీపంలో కొత్త  సైనిక కంటోన్మెంట్ స్థావరాన్ని నిర్మిస్తుంద‌ని తెలుస్తోంది.  కాగా, ఈ చర్యలు ఈ ప్రాంతంలో అశాంతిని రాజేయడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇలాంటి చ‌ర్య‌లు రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లుగానే భావించాల్సి వ‌స్తుంద‌ని భార‌త ఆర్మీ వ‌ర్గాలంటున్నాయి. పాక్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ధీటైన స‌మాధానం చెప్పేందుకు భారత్ సిద్ధంగా ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నాయి.

ALSO READ : Indian Ocean-China : మయన్మార్ మీదుగా హిందూ మహాసముద్రంలోకి చైనా..కొత్త రైల్వే లైన్ ప్రారంభం