Petrol Prices Hiked: ఆగని బాదుడు.. నేడు మరోసారి పెరిగిన చమురు!

ఒకవైపు కరోనా వేళ ఉపాధి కోల్పోయిన మధ్య తరగతి ప్రజల మీద పెట్రో బాదుడు ఆగడం లేదు. దాదాపుగా ఇరవై రోజుల నుండి విడతల వారీగా ఈ చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి.

Petrol Prices Hiked

Petrol Prices Hiked: ఒకవైపు కరోనా వేళ ఉపాధి కోల్పోయిన మధ్య తరగతి ప్రజల మీద పెట్రో బాదుడు ఆగడం లేదు. దాదాపుగా ఇరవై రోజుల నుండి విడతల వారీగా ఈ చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు 24 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 29 పైసల వరకూ పెరిగింది. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.68, డీజిల్‌ లీటర్ రూ.84.61కు చేరగా.. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర వందకు చేరువైంది. పెట్రోల్ రూ.99.94, డీజిల్ లీటరుకు రూ.91.87కు పెరిగింది.

గురువారం పెంపుతో ఒక్క మే నెలలోనే 14 సార్లు ఇంధన ధరలను పెంచాయి చమురు సంస్థలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజు నుండి మొదలైన ఈ పెట్రోల్‌ ధరలు పెంపు నేటికీ పైకి ఎగబాకుతూనే ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.3.33, డీజిల్‌పై రూ.4 వరకు ధర పెరిగింది. అత్యధికంగా రాజస్థాన్ శ్రీగంగానగర్ పెట్రోల్ ప్రస్తుతం రూ.104.67కు చేరగా.. భూపాల్, జైపూర్ లో కూడా సెంచరీ దాటేసింది. ఇక, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా అదే దారిలో సెంచరీకి చేరువలో ఉన్నాయి.

అసలే కరోనాతో ఆర్ధికంగా చితికిపోయిన సామాన్య ప్రజలకు పెట్రో బాదుడు మరింత భారంగా మారుతుంది. అంతర్జాతీయ, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రో ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి. దీనికి తోడు చమురు పై ట్యాక్సులు పెంచడం ధరల పెరుగుదలకు మరో కారణం కాగా.. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా చమురు సంస్థలు పెట్రోల్ ధరలను మాత్రం తగ్గించకపోవడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.