నీ విలువేంటో తెలిసింది.. అందుకే మొక్కుతున్నా..

Life Of City: ఏదైనా లేనప్పుడే విలువ తెలుస్తుంది అనేది వాస్తవం.. లాక్‌డౌన్ దేశప్రజలకు అటువంటి ఎన్నో అనుభవాలను.. పాఠాలను, గుణ పాఠాలను నేర్పింది.. కరోనా వచ్చిన తర్వాత దేశంలో రవాణా రంగంపై ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌లను సామాన్యుల రవాణా బస్సులు, రైళ్లు తిరగడం దాదాపుగా ఆగిపోయాయి.

దేశంలో ప్రజారవాణ తక్కువ ఖర్చు అయ్యేది రైళ్లలో అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అటువంటి రైళ్లు దేశంలోనూ.. వివిధ రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు.. ఇప్పుడు కాస్త కరోనా నుంచి దేశం కోలుకోగా.. ఇప్పడిప్పుడే రైళ్లు, లోకల్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 11 నెలల తరువాత ముంబైలో లోకల్ ట్రైన్లు స్టార్ట్ అయ్యాయి.

ఈ క్రమంలో ఎమోషనల్ అయిన ఓ యువకుడు విరామం తర్వాత లోకల్ ట్రైన్ ఎక్కుతూ తలవంచి దండం పెడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా కారణంగా లోకల్ ట్రైన్లు రద్దు కావడంతో సామాన్యుడి జీవితం ముంబైలో ఛిద్రం అవగా.. లోకల్ ట్రైన్ మొదలు కావడంతో నీ విలువ తెలిసింది.. అందుకే మొక్కుతున్నా అన్నట్లుగా ఆ ఫోటో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ ఫోటోను షేర్ చేసి “సోల్ ఆఫ్ ఇండియా” అని కామెంట్ చేశారు.

మార్చి 2020లో కరోనావైరస్ వ్యాప్తి చెందిన సమయం నుంచి స్థానిక రైళ్ల ప్రయాణం ఆగిపోయింది. ముంబై మరియు చుట్టుపక్కల పట్టణాల్లో నివసిస్తున్న లక్షలాది మంది రైళ్లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ఉపాధి కూడా ప్రభావం అయ్యింది.. సిటీ లైఫ్‌లో సాధారణ జీవితం గడిపే ఎంతోమంది లోకల్ ట్రైన్‌లో తిరుగుతారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ముంబై రైళ్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.