కరోనా కాలర్ ట్యూన్, అమితాబ్ వాయిస్ వద్దంటూ పిటిషన్

amitabh bachchan caller tune on covid 19 : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌పై ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలర్‌ట్యూన్‌కు అమితాబ్ వాయిస్ వచ్చారు. అయితే దీనికి బిగ్‌బీ అనర్హుడంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అమితాబ్‌ గొంతును ఆ కాలర్‌ట్యూన్‌ నుంచి తొలగించాలని ఆయన కోరారు.

అందరికీ కాలర్‌ ట్యూన్‌లో జాగ్రత్తలు చెప్పే అమితాబ్.. కరోనా బారిన పడ్డారని, ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారని పిటిషనర్ ఆరోపించారు. కరోనా కాలంలో ఎంతో మంది సినిమా ప్రముఖులు సమాజ సేవలో పాల్గొన్నారని, పేదలకు భోజనం పెట్టడంతో పాటు వసతి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వాళ్లలో చాలా మంది ఈ కాలర్ ట్యూన్‌కు ఉచితంగా వాయిస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. అమితాబ్ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారని ఆరోపించారు.

అమితాబ్‌ ఒక సామాజిక కార్యకర్తగా దేశ సేవ చేయలేదని.. ఆయనపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్‌లో సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. అమితాబ్‌ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడని చెప్పారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌.పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌ ధర్మాసనం విచారించింది. కాగా కోర్టు తదుపరి విచారణను జనవరి 18కు వాయిదా వేసింది.