భారత దిగ్గజ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని తాపత్రయపడుతున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ తెందుల్కర్ 73వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీలో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటాడు. ఎంఐజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్.. ఇస్లాం జింఖానాతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించి ఆడాడు.
ఈ మ్యాచ్‌లో అర్జున్.. 31 బంతుల్లో 77 పరుగులు చేయగా.. మూడు వికెట్లు కూడా తీసుకుని ప్రత్యర్థి జట్టును చిత్తుచేశాడు. బ్యాటింగ్ ఆడే సమయంలో ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు సాధించగా.. స్పిన్నర్ హషీర్ వేసిన ఓ ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్‌తో పాటు కెవిన్ (96), ప్రగ్నేష్ (112) సత్తాచాటడంతో ఎంఐజీ జట్టు 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 385 పరుగులు చేసింది.
తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు 41.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ముంబయి క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ కరోనా విరామం తర్వాత ముంబైలో జరిగిన తొలి క్రికెట్ పోటీగా నిలిచింది. అర్జున్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించాడు.. ఐపీఎల్ వేలంలోనూ అతడు ఉన్నాడు.