ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు…సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు

  • Publish Date - December 1, 2020 / 11:31 AM IST

Old Malakpet Polling canceled : హైదరాబాద్ ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు అయింది. 26 వ నెంబర్ వార్డులో బ్యాలెట్ పేపర్ పై సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు ముద్రితమైంది. బ్యాలెట్ పేపర్ పై గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ ను రద్దు చేశారు. కంకి కొడవలి గుర్తు స్థానంలో సుత్తి కొడవలి గుర్తు ముద్రించారు. దీంతో అక్కడ పోలింగ్ ను రద్దు చేశారు.



గుర్తులు తారుమారు కావడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యం వల్లే కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తు ముద్రితమైందని అన్నారు. ఏ అధికారి వల్ల తప్పు జరిగిందో గుర్తించి అతనిపై చర్య తీసుకోవాలని కోరారు.



ఈ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ కమిషనర్ ను నివేదిక కోరింది. ఓల్డ్ మలక్ పేట లో ఈసీ పోలింగ్ ను నిలిపివేసింది. ఈ నెల 3న రీపోలింగ్ నిర్వహించనున్నారు.