రాజకుటుంబంపై మేఘల్ జాత్యంహకార ఆరోపణలు కొట్టిపారేసిన ప్రిన్స్ విలియం

Prince William ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బ్రిటిష్ రాజకుటుంబంపై ఆ ఇంటి కోడలు, ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ చేసిన జాత్యహంకార ఆరోపణలను హ్యారీ సోదరుడు ప్రిన్స్‌ విలియం ఖండించారు. రాజవంశీయులు జాత్యాంహకారులు అంటూ మేఘన్ చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొన్నారు. బ్రిటన్ రాజ వంశీకులు ఎంతమాత్రం జాత్యహంకారులని విలియం పేర్కొన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత రాజ కుటుంబానికి చెందిన ఒకరు బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి. క్వీన్ ఎలిజబెత్ తరపున ఆమె సిబ్బంది మంగళవారం ఓ సంక్షిప్త ప్రకటనను మాత్రమే విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే, ప్రిన్స్ హ్యారీ సోదరుడు మరియు తండ్రి ప్రిన్స్ చార్లెస్ తర్వాత రాజకుటుంబంలో రెండవ స్థానంలో ఉన్న ప్రిన్స్‌ విలియం.. గురువారం తన భార్య కేట్ విలియంతో కలిసి తూర్పు లండన్‌లోని ఒక పాఠశాలను సందర్శించారు. ఈ సమయంలో ప్రిన్స్ విలియంతో ఓ విలేకరి.. ‘‘రాజ కుటుంబం ఓ జాత్యహంకార కుటుంబమా, సార్?’’ అని అడిగారు. ఈ ప్రశ్నకు విలియం స్పందిస్తూ ‘‘మాది జాత్యహంకార కుటుంబం ఎంత మాత్రం కాదు’’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయనే మళ్ళీ మాట్లాడుతూ, ‘‘ఓహ్, హ్యారీ, నేనింకా ఆయనతో మాట్లాడలేదు, కానీ మాట్లాడతాను’’ అని చెప్పారు. ఈ సమయంలో ప్రిన్స్ విలియంతోపాటు ఆయన సతీమణి కేట్ కూడా ఉన్నారు.

ఇక,మంగళవారం క్వీన్ ఎలిజబెత్ విడుదల చేసిన ప్రకటనలో.. ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ వర్కింగ్ రాయల్స్‌గా జీవితం సంక్లిష్టమైనదిగా భావించడం తనను బాధించినట్లు తెలిపారు. వీరు లేవనెత్తిన అంశాలు, మరీ ముఖ్యంగా జాతికి సంబంధించిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. కొన్ని జ్ఞాపకాలు విభిన్నంగా ఉండవచ్చునని, వాటిని తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై రాజ కుటుంబం ప్రైవేటుగా చర్చిస్తుందని వివరించారు.

ప్రిన్స్ హ్యారీ-మేఘన్ దంపతులు ఇంటర్యూలో ఏం చెప్పారు

బ్రిటిష్ రాజకుటుంబం నుంచి విడిపోయిన తర్వాత తొలిసారిగా​ హ్యారీ,మేఘన్​ మార్కెల్​ దంపతులు నాలుగురోజుల క్రితం అమెరికాలోని పాపులర్​ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రేకి ఇంటర్యూ ఇచ్చారు. ఇంటర్యూలో ఈ దంపతులు సంచలన విషయాలను వెల్లడించారు. రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు మేఘన్ తెలిపారు. తమ పెళ్లికి ముందు తోడికోడలు, విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్ తనపై కేకలు వేసినట్టు మీడియాలో జరిగిన ప్రచారం నిజమేనని మేఘన్ ధ్రువీకరించింది. హ్యారీతో వివాహం అయిన తొలినాళ్లలో ప్యాలెస్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నా..రాజకుటుంబంలో ఒక్కరు కూడా తనకు సాయం చేయలేదని.. పైగా తనపై అసత్య ఆరోపణలు చేశారని.. నిందలు వేశారని మేఘన్ తెలిపారు. వీటన్నింటినీ చూసి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పారు.

తాను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి కుటుంబంలో చర్చ జరిగిందని మేఘన్ తెలిపారు. తాను నల్లగా ఉన్నాను కాబట్టి..పుట్టే బిడ్డ కూడా నల్లగానే పుడతాడని వారు ఆందోళన చెందారన్నారు. దీని గురించి హ్యారీతో కూడా వారు చర్చించారన్నారు. అంతేగాక, తమ బిడ్డకు భద్రత ఉండదని,టైటిల్‌ కూడా రాదని మాట్లాడుకున్నారుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్స్‌ హ్యారీ కూడా సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం మేఘన్‌ కోసమే తాను రాజకుటుంబం నుంచి బయటకు రాలేదని హ్యారీ తెలిపారు. తనను ట్రాప్ చేశారని,తనకు ఆ విషయం మొదట్లో తెలియలేదన్నారు. తన తండ్రి, సోదరుడిని కూడా ట్రాప్‌ చేశారని తెలిపారు. తన తండ్రి ప్రిన్స్‌ ఛార్లెస్‌, సోదరుడు ప్రిన్స్‌ విలియంతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు.