Bhuteshwar Nath Temple : శివలింగంపై గ్లాసు నీళ్ళు పోస్తే సమస్యలు పోతాయట!

నిత్యం ఎంతో మంది భక్తులు స్వామి వారిని సందర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సమస్యల్లో ఉన్న ఎంతో మంది ఇక్కడకు వచ్చి ఒక్క గ్లాసు నీరు తీసుకుని శివలింగంపై పోస్తారు.

Bhuteshwar Nath Temple : సమస్యలతో సతమతమౌతున్న వారు ఆస్వామికి భక్తితో గ్లాసు నీళ్ళు సమర్పిస్తే చాలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంతో మంది భక్తులు విశ్వాసంతో దేశం నలుమూల నుండి ఈ స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారు. లింగాకారంలో అత్యంత ఎత్తులో ఉండే భూతేశ్వర్ నాధ్ ఆలయం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉంది. ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

ఛత్తీస్ గడ్ రాష్ట్ర రాజధాని రాయపుర్ కి దగ్గరలో ఉన్న గరియాబంద్ జిల్లాలోని మరోడా గ్రామంలో భూతేశ్వరనాధ్ ఆలయం ఉంది. చుట్టూ దట్టమైన అడవుల మధ్య అహ్లాదరకమైన వాతావరణంలో లింగాకారంలో స్వామి కొలువై ఉన్నాడు. 18అడుగుల ఎత్తులో పైన 20 అడుగుల వెడల్పుతో కూడిన గోళాకారంలో శివలింగం ఉంటుంది. ఈ శివలింగం విశేషత ఏమిటంటే ప్రతి సంవత్సరం 6నుండి 8అంగుళాలు పెరుగుతుంది. రెవిన్యూ శాఖ అధికారులు ప్రతి సంవత్సరం దాని పెరుగుదలను రికార్డు చేస్తారు.

నిత్యం ఎంతో మంది భక్తులు స్వామి వారిని సందర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సమస్యల్లో ఉన్న ఎంతో మంది ఇక్కడకు వచ్చి ఒక్క గ్లాసు నీరు తీసుకుని శివలింగంపై పోస్తారు. ఇలా చేయటం ద్వారా వారికున్న సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో భక్తులు కాలినడకన వివిధ ప్రాంతాలనుండి ఈ ఆలయ దర్శనకోసం వస్తుంటారు.

వందల సంవత్సరాలనాటి భూతేశ్వర్ నాధ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. జమిందారీ వ్యవస్ధ ఉన్న సమయంలో గరియాబంద్ ప్రాంతంలో శోభా సింగ్ అనే జమిందార్ ఉండేవాడు. మరోడా గ్రామంలో శోభాసింగ్ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు సాయంత్రం తన పొలానికి వెళ్లే సందర్భంలో పొలానికి సమీపంలోని ఓ ప్రత్యేక అకారం నుండి ఎద్దు రంకెలు వేయటం, సింహం గాండ్రింపు శబ్ధాలు వినిపించాయి. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు.

గ్రామస్తులంతా అక్కడకు చేరుకున్నారు. వారికి కూడా అలాంటి శబ్ధాలే వినబడటంతో సమీప ప్రాంతాల్లో ఈ జంతువులు ఉన్నాయేమోనని గాలింపు మొదలు పెట్టారు. కాని వాటి అచూకి మాత్రం కనుగొన లేకపోయారు. మట్టిదిబ్బగా ఉన్నచోట నుండే ఈ అరుపులు వినిపిస్తున్నాయని గ్రహించి అందులో ఏదో మహిమఉన్నట్లు భావించారు. అప్పటి నుండి వారంతా దానిని శివలింగంగా భావించి పూజించటం ప్రారంభించారు.

ఆప్రాంతంలో ఎంతో విశిష్టత కలిగిన ఆలయంగా భూతేశ్వర నాధ్ ఆలయం వెలుగొందుతుంది. శ్రావణ మాసం తోపాటు, మహాశివరాత్రి పర్వదినాల సమయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంత వాసులకు ఏచిన్న సమస్య వచ్చినా స్వామి ఆలయానికి వచ్చి భక్తితో శివలింగంపై గ్లాసు నీళ్ళు పోసి నమస్కరిస్తారు. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని భక్తులు చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు