Asani Cyclone
Asani Cyclone: బుధవారం నుంచి రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ‘అసని’ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, ఉదయం తుపానుగా బలహీనపడి మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
PawanKalyan: తుపాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్
ఈ తుపాను సుమారు ఉత్తర ఈశాన్య దిశగా పయనించి నరసాపురం, యానాం, కాకినాడ, విశాఖపట్నం తీరం మీదగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరానికి ఈరోజు సాయంత్రం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి గురువారం ఉదయం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈరోజు ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తుఫాను ప్రదేశం నుంచి తెలంగాణ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5కి మీ ఎత్తు వరకు వ్యాపించి కొనసాగుతుంది.