Uae’s Golden Visa
UAE’s Golden Visa: యూఏఈలో అత్యంత అరుదుగా జారీ చేసే గోల్డెన్ వీసాను మనదేశానికి చెందిన ఓ విద్యార్థిని దక్కించుకున్నారు. ఉన్నత చదువులో మెరిట్ ఆధారంగా విద్యార్థి విభాగంలో కేరళకు చెందిన తస్నీమ్ అస్లాం ఈ వీసాను అందుకున్నారు. ఈ వీసాతో ఆమెకు పదేళ్ల పాటు అంటే 2031 వరకు యూఏఈలో ఉండే అవకాశం లభించింది. దీంతో తస్నిమ్.. ఆమె కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే.. అసలు ఈ గోల్డెన్ వీసా ఏంటి.. దీని వెనుక కథేంటి? ఇది ఎవరికి ఇస్తారన్నది ఒకసారి చూద్దాం.
యూఏఈలో నివసించేందుకు వీసా దక్కించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ ఇక్కడ ఉండేందుకు వీసా దక్కించుకున్నా అది కొద్ది కాలానికే ఇస్తారు. కాగా.. విదేశీయులు దేశంలో దీర్ఘకాలం పాటు ఉండేందుకు 2019లో నూతన వీసా విధానాన్ని సడలించి కాస్త కొత్తగా రూపొందించింది యూఏఈ ప్రభుత్వం. అప్పుడే ఈ గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసాను సాధారణంగా సంపన్న వ్యాపారులకు.. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తులకు మాత్రమే ఒక అరుదైన గౌరవ సూచికగా అందిస్తారు.
అలాంటి వీసాను తన ప్రతిభ ఆధారంగా కేరళకు చెందిన విద్యార్థిని ఈ వీసాను దక్కించుకున్నారు. ప్రతి ఐదేళ్లకు లేదా పదేళ్లకు ఓసారి ఈ గోల్డెన్ వీసాలను జారీ చేస్తుండగా గడువు తీరిన తర్వాత వీటిని మళ్ళీ పొడగించుకోవచ్చు. యూఏఈ గోల్డెన్ వీసా పొందడంపై స్పందించిన తస్నీమ్ అస్లాం ఇది తన జీవితంలోనే మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా పేర్కొన్నారు. తాను చదువులో రాణించి, మెరిట్ సాధించడం వల్లే ఇదంతా సాధ్యమైందని.. తన పేరెంట్స్ సపోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని పేర్కొంది.
కాగా.. తస్నీమ్ షార్జాలోని అల్ ఖాసిమియా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ షరియాను అభ్యసించగా 72 దేశాల విద్యార్థులు గల తన క్లాస్‌లో ఆమె టాప్‌లో నిలిచారు. అలాగే ఆమె షార్జా యూనివర్శిటీ నుంచి ఫిఖ్(ఇస్లామిక్ న్యాయ శాస్త్రం)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా కూడా పొందారు. తస్నీమ్ తండ్రి మొహమ్మద్ అస్లాం షార్జా సిటీ మున్సిపాలిటీ మాజీ ఉద్యోగి కాగా ప్రస్తుతం ఆయన ఎమిరేట్‌లో టైప్ రైటింగ్ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇలా కుమార్తెకు అరుదైన వీసా దక్కడంపై తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.