corona cases india : భారత్ లో మరోసారి కరోనాకేసులు పెరగడానికి కారణం ఇదే!

భారత్ లో కరోనా వైరస్ ను నియంత్రించడానికి లాక్డౌన్ విధించిన ఒక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో దఫా క్రియాశీల కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి.

భారత్ లో కరోనా వైరస్ ను నియంత్రించడానికి లాక్డౌన్ విధించిన ఒక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో దఫా క్రియాశీల కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి.. అదేక్రమంలో మరణాల సంఖ్య కూడా పెరగడం భారతీయుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. మార్చి 24 ఉదయం నాటికి, 24 గంటల్లో 47 వేల 262 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 275 మరణాలు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో కంటే మార్చిలో 20% ఎక్కువ మరణాలు సంభవించాయని డేటా చెబుతోంది.

మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గడ్ మరియు గుజరాత్‌లలో కేసులు వేగంగా పెరగడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మార్చి 24 నాటికి మహారాష్ట్రలో 24 గంటల్లో అత్యధికంగా 28,699 కేసులు నమోదయ్యాయి. దీని తరువాత పంజాబ్ (2,254), కర్ణాటక లో 2,010 కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 132 మంది మరణించారు. దీని తరువాత పంజాబ్ (53), ఛత్తీస్‌గడ్ 20 మంది మరణించారు.

భారత్ లో ఫిబ్రవరి 15 తర్వాత కరోనా రెండవ వేవ్ మొదలైందని గణాంకాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1 మరియు 7వ తేదీ మధ్య 80,180 కేసులు నమోదయ్యాయి, ఫిబ్రవరి 15-21 మధ్య 86,711 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత వారంలో, కొత్త కేసులు లక్ష మార్కును దాటాయి.. మార్చి 15-21 మధ్య, ఇది రెండు లక్షల మార్కును దాటింది.

ఈ కాలంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా పెరిగింది. మార్చి 15-21 మధ్య, మరణాలు 1,000 మార్కును దాటాయి.. అంతకుముందు వారంతో పోలిస్తే ఈ సంఖ్య 34.9 శాతం పెరిగింది. అయితే ఈ అనర్ధానికి కారణం ముమ్మాటికీ నిర్లక్షమే అన్న వాదన వినబడుతోంది. దేశంలో టీకా వేయడం ప్రారంభించిన తరువాత, కరోనా అంతమైపోయిందని ప్రజలు భావించడంతోనే సెకండ్ వేవ్ మొదలైందని ప్రభుత్వ అధికారులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా మందగించిందన్న కారణంతో ప్రజలు మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా విహరించడం వలన ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు