Agricultural Machinery : రైతుకు శ్రమ, ఖర్చు తగ్గించి.. వ్యవసాయంలో ఉపయోగపడే యంత్రపరికరాలు

వరికోసేందుకు రైతుకు అందుబాటు ధరలో వున్న యంత్రం ప్యాడీ రీపర్. ఇది 5 హెచ్.పి డీజిల్ ఇంజనుతో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ 2గంటల్లో ఎకరా పొలాన్ని కోయగలదు. కింది భాగంలో వున్న బ్లేడ్లు వరిని కోయగా, బెల్టులు కోసిన వరిని కుడివైపుకు వేస్తాయి.

Agricultural Machinery : రైతుకు శ్రమ, ఖర్చు తగ్గించి.. వ్యవసాయంలో ఉపయోగపడే యంత్రపరికరాలు

Machinery used in agriculture

Agricultural Machinery : ఖరీఫ్ సాగుకు సమయం ఆసన్నమవుతంది. ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతును వెన్నాడుతోంది. వ్యవసాయంలో మానవ వనరుల కొరత నానాటికీ జఠిలంగా మారుతున్న ప్రస్థుత తరుణంలో దీనికి పరిష్కారం లేదా? అంటే మనముందున్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ. వ్యవసాయంలో ఆధునిక పరికరాలు వాడటంవల్ల ఖర్చు తగ్గటమేకాక, సమయం కూడా కలిసొస్తుంది. శ్రమ తక్కువగా వుండి లాభం పెరుగుతుంది. దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. మెట్ట మాగాణుల్లో ప్రస్థుతం అందుబాటులో వున్న కొన్ని ముఖ్యమైన వ్యవసాయ యంత్రాలు, వాటి పనితీరు, ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ ALSO : Cultivation Of Inter Crops : అంతర పంటల సాగుతో.. అధికలాభాలు ఆర్జిస్తున్న రైతు

అంతర్జాతీయంగా మన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరగాలన్నా… ధరలు ఆశాజనకంగా వుండాలన్నా…. ముందుగా మన వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పెంపొందించే దిశగా ప్రతీ రైతు ముందడుగు వేయాలి. ఈ క్రమంలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు కీలక భూమికను పోషిస్తున్నాయనటంలో సందేహం లేదు. నాటు నుంచి కోత వరకు, దుక్కి నుంచి పంట నూర్చే వరకు వివిధ ఆధునిక యంత్ర పరికరాలు వ్యవసాయంలో ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. రైతుకు శ్రమను, ఖర్చును తగ్గిస్తూ… సాగును మరింత సులభంచేస్తున్నాయి. సాంప్రదాయ సాగు విధానాలతో సతమవుతున్న రైతును, ఆధునిక వ్యవసాయ పరికరాలు సరికొత్త సాగు విధానల వైపు మరలే దిశగా… ప్రోత్సహిస్తున్నాయనటంలో సందేహం లేదు…

ఇటీవలికాలంలో రైతులు ఎక్కువగా వాడుతున్న పరికరం రోటావేటర్. ఇది మాగాణి దమ్ముకు, మెట్టభూముల దుక్కి తయారీకి బాగా పనికివస్తుంది. ఇతర అన్ని పరికరాలకంటే బాగా పనిచేస్తోందని రైతుల అనుభవం చెబుతోంది. దీన్ని వాడేటప్పుడు మొదట పొడి దుక్కుచేయాల్సిన అవసరం లేదు. ఇది 10సెంటీమీటర్ల లోతు వరకు నేలను కోసి నేరుగా దమ్ముచేస్తుంది. రోటావేటర్ తో దమ్ముచేయటం వల్ల నీరు లోనికి ఇంకిపోకుండా 10సెంటీమీటర్ల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. ఈ పరికరంతో వచ్చే దమ్ము నాణ్యత ఏ ఇతర పనిముట్టుతోను సాధ్యంకాదు. మాగాణుల్లో రోటోవేటర్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రోటావేటర్ వాడి దుక్కిచేయటంతో కలుపు మొక్కల ప్రభావం బాగాతగ్గుతుంది. రోటోవేటర్ వాడకం వల్ల దున్నే సమయం ఖర్చు తగ్గుతుంది.

READ ALSO : Making Vermicompost : పంటల పాలిట కల్పతరువుగా సేంద్రియ ఎరువులు.. వర్మీకంపోస్ట్ తయారితో స్వయం ఉపాధి

వరి నాట్లు వేయటానికి కూలీల సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీన్ని అదిగమించేందుకు నేడు అనేక కంపెనీలనుంచి వరినాటు యంత్రాలు అందుబాటులోకొచ్చాయి. జపాన్, కొరియా, చైనా దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు. పెట్రోల్, డీజల్ సహాయంతో 15నుంచి 21 అశ్వసామర్ధ్యంతో నడిచే యంత్రాలు వాడుకలో వున్నాయి. గంటకు 2-3లీటర్ల ఇంధన వినియోగం వుంటుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య10-20సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు.

బరువైన నల్లరేగడి నేలల్లో కూడా ఈ యంత్రాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి.  నేల పరిస్థితి, స్వభావాన్నిబట్టి ఎకరా పొలాన్ని ఒకటిన్నరనుంచి రెండు గంటల్లో నాటుకోవచ్చు. ఈ యంత్రాలతో వరినాట్లు వేసేటప్పుడు నారును ప్రత్యేకంగా ట్రేలలో పెంచాల్సి వుంటుంది. ప్రస్థుతం మెకనైజ్ డ్ శ్రీ విధానంలో మంచి ఫలితాలు వస్తున్న దృష్ట్యా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం వారు ఈ విధానంలో సాగుకు అవసరమైన యంత్ర పరికరాను ఒక ప్యాకేజిగా రూపొందించి రైతులకు అందిస్తున్నారు.

వరి విత్తనాన్ని డ్రమ సీడర్ తో విత్తే విధానంలో ఇటీవలికాలంలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. డ్రమ్ సీడర్ ద్వారా మొలక వచ్చిన విత్తనాన్ని ఒకేసారి 8సాళ్లలో విత్తుకోవచ్చు. ఈ విధమైన సాగులో వరినారు పెంచటం, నాటటం వుండదు కనుక ఎకరానికి 2-3వేల వరకు సాగు ఖర్చులు తగ్గుతున్నాయి. ఒక మనిషి డ్రమ్ సీడర్ లాగటానికి, మరొకరు విత్తనం నింపటానికి అవసరమవుతారు.  ఎకరా పొలాన్ని విత్తటానికి 4గంటల సమయం పడుతుంది. ఈ డ్రమ్ సీడర్ ధర చాలా తక్కువే ఉంటుంది.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

మెకనైజ్ డ్ శ్రీ విధానంలో వరుసలు, మొక్కల మధ్య దూరం ఎక్కువగా వుంటుంది కనుక కలుపు సమస్య ఎక్కువగా వుంటుంది. దీన్ని సమర్ధవంతంగా అరికట్టేందుకు ఇటీవల కోనోవీడర్ కు ప్రత్యామ్నాయంగా, పవరవీడర్ యంత్ర పరికరం అందుబాటులోకొచ్చింది. ఈయంత్రం హాఫ్ హెచ్.పి మోటారు సహాయంతో పనిచేస్తుంది. ఎకరానికి రెండున్నర లీటర్ల పెట్రోలు అవసరమవుతుంది. ఒక మనిషి సహాయంతో ఈ యంత్రాని ఉపయోగించి రోజుకు రెండున్నర ఎకరాల్లో కలుపును పొలంలో కలియదున్నవచ్చు.

వరికోసేందుకు రైతుకు అందుబాటు ధరలో వున్న యంత్రం ప్యాడీ రీపర్. ఇది 5 హెచ్.పి డీజిల్ ఇంజనుతో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ 2గంటల్లో ఎకరా పొలాన్ని కోయగలదు. కింది భాగంలో వున్న బ్లేడ్లు వరిని కోయగా, బెల్టులు కోసిన వరిని కుడివైపుకు వేస్తాయి. యంత్రం నడవటానికి గంటకు లీటరు డీజిల్ ఖర్చవుతుంది. పడిపోయిన వరి పైరును ఈ యంత్రంతో కోయటం సాధ్యపడదు. దీంతో పశుగ్రాసాలను కూడా సులభంగా కత్తిరించుకునే అవకాశముంది.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

అయితే వరి కోత నూర్పిడి పనులు ఒకేసారి పూర్తయ్యే విధంగా కంబైన్డ్ హార్వెస్ట్ ర్ లు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. వీటి ధర ఎక్కువగా వున్నా రైతులు అద్దెకు తీసుకుని వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ యంత్రం ఎకరా పొలాన్ని గంటలో కోత నూర్పిడిచేస్తుంది. దీని వాడకం వల్ల ఎకరానికి 1500-2000వరకు ఖర్చు తగ్గుతోంది. రైతులు తక్కువ రిస్క్ తో తక్కువసయంలో కోత నూర్పిడి చేయగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో దీనిలో కొద్దిపాటి మార్పులు చేసి మొక్కజొన్న కోత, నూర్పిడి పనులకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు.

ఆధునిక వ్యవసాయ యంత్రాల వాడకం వల్ల రైతుకు శ్రమ, ఖర్చు తగ్గటంతోపాటు పంట ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుతోంది. పంటను బట్టి, సాగు విధానాన్ని బట్టి ఈ యంత్రాలు అందుబాటులో వున్నాయి. యంత్రాల కొనుగోలుకు ప్రారంభంలో కొంత ఖర్చు ఎక్కువ అనిపించినా… దీర్ఘకాలంలో వీటి వల్ల ఫలితాలు అనేకం.