రేపటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు.. హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం

  • Publish Date - December 10, 2020 / 09:14 PM IST

Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎస్‌ను ఆదేశించారు కేసీఆర్‌. కోర్టు కేసులు, సాంకేతిక పరమైన సమస్యలతో దాదాపు మూడు నెలలకు పైగా..రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.



వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సీఎం కేసీఆర్‌.. సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రేపటి నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.



ఇక అంతకుముందు ధరణి పోర్టల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్‌లపై స్టే ఇవ్వలేమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. పాత పద్దతిలో రీజిస్ట్రేషన్ చేస్తే తమకేం అభ్యంతరం లేదని తెలిపింది.

రిజిస్ట్రేషన్‌లు గతంలో CARD పద్ధతిలో జరిగాయని.. ప్రస్తుతం అదే పద్ధతి కొనసాగించాలని పిటీషనర్‌ తరపు న్యాయవాదులు అన్నారు.



ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ గతంలో మాదిరిగానే రిజిస్ట్రేషన్ చేసుకునే విదంగా చూడాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. ఆధార్ కార్డు వివరాలను ధరణిలో నమోదు కోసం అడగవద్దని పిటీషనర్ తరపు న్యాయవాది కోరారు. రూల్స్ 221, 230 ఏపీ అండ్‌ తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్, సెక్షన్‌ 70B ప్రకారం తెలంగాణ మొత్తం నోటిఫై చేయాలని హైకోర్టు ఆదేశించింది.



నాన్‌ అగ్రికల్చర్ ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చని హైకోర్టు సూచించింది. స్లాట్ బుకింగ్‌తో పాటు పీటీఐఎన్‌ ఆధారంగా ఉన్న పద్దతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని విజ్ఞప్తి చేసింది. నాన్‌ అగ్రికల్చర్ ప్రాపర్టీస్‌కు, పీటీఐఎన్‌ లేనివాళ్లకు రెండు రోజుల్లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరింది.



అమ్మేవారు, కొనేవారు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లి పాత పద్ధతిలో రీజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ధరణిపై మాత్రం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.