కరోనా వేళ..రోజుకు రూ. 68 కోట్ల మద్యం తాగేస్తున్నారు..ఎక్సైజ్ శాఖ ఖజానా గలగల.. అంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే, జూన్ మాసాల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు రూ. 68 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అంచనా. కానీ..జూన్ మాసంలో లిక్కర్ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని, అయితే..బీర్ల అమ్మకాలు మాత్రం జోరుగా సాగాయంట.
మొత్తంగా రెండు నెలల్లో కలిపి రూ. 3 వేల కోట్ల వరకు ఖజానాకు కాసుల పంట పండిందని తెలుస్తోంది. లాక్‌డౌన్ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం విక్రయాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అదే నెలలో రూ.1,864 కోట్లు, జూన్ మాసం మొత్తంలో రూ.1,955 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ కేసులను వైన్స్ యజమానులు మద్యం డిపోల నుంచి కొనుగోలు చేశారని అంచనా.
ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తుండడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారంలో ఒక్కసారిగా లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయి. జూన్ నెలాఖరులో డిపోల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయని, మొత్తం మీద ఈ రెండు నెలల మద్యం అమ్మకాల ద్వారా రూ.3,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరినట్టైంది.
2020, జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ఏకంగా రూ.1,153 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరింది. ఇక్కడ 15 లక్షలకు పైగా కేసుల బీర్లు, 13.45 లక్షల కేసుల లిక్కర్ లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత 15 రోజుల్లో కలిపి కేవలం రూ.800 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్ అమ్మకాలే జరిగాయి. జూన్ నెలలో బీర్ల అమ్మకాలు బాగా జరిగాయని, మే నెలలో 26 రోజుల అమ్మకాలకు గాను 23 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
Read:తెలంగాణలో కొత్తగా 1,892మందికి.. గ్రేటర్ పరిధిలోనే 1,658 కరోనా కేసులు