MLA Sandra Venkata Veeraiah
Sandra Venkata Veeraiah – BRS: సోషల్ మీడియాలో తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, గతంలో తాను టీడీపీ(TDP)లో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఖమ్మం(Khammam)లోని సత్తుపల్లి(Sathupalli)లో ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇలాగే అసత్య ప్రచారం చేస్తే వారికి తగిన బుద్ధి చెబుతామని సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కొందరు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధమై, చివరకు కాంగ్రెస్ లో చేరారని అన్నారు. వారి బుద్దులు మాత్రం మారలేదని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి గురించే చెబుతామని, ఇతరుల గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
ఒకవైపు భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి కష్టాలను తీర్చడానికి ప్రభుత్వానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ కాలం గడుపుతోందని సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీనికి కారణం కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు.