Panner
Sasikala: మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె.శశికళను ఎఐఎడిఎంకె లోకి తిరిగి ఆహ్వానించమని ముఖ్యమంత్రి ఇ పళనిసామి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు విరుద్ధంగా ఎఐఎడిఎంకెలోకి శశికళ రాకపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు.. శశికళ ఎఐఎడిఎంకె లోకి తిరిగి వచ్చే విషయం గురించి ఆలోచించవచ్చని.. ఈ అంశాన్ని మంచి మనస్సుతో పరిశీలించడానికి పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.
వి.కె.శశికల 4 సంవత్సరాల జైలు జీవితం గడిపారని.. 32 సంవత్సరాలపాటు అమ్మ (జయలలిత) తో కలిసి జీవించారని.. అందువల్ల మానవీయ కోణంలో ఆమె రాక గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పన్నీర్ సెల్వం అభిప్రాయపడ్డారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సుమారు రెండు వారాల ముందు, ఈ పెద్ద ప్రకటన అధికార ఎఐఎడిఎంకె నుండి రావడం చర్చనీయాంశం అయింది.
ఇదిలావుంటే అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించిన శశికళ.. గతనెల బెంగుళూర్ జైలునుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఆమె రాజకీయాల్లో బిజీ అవుతారని అందరూ ఊహించారు.. కానీ అనూహ్యంగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారామె. దాంతో శశికళ అభిమానులు తీవ్ర నిరాశచెందారు.