నమ్మొద్దు.. అలా ఉద్యోగాలు రావు..

ఇటీవలికాలంలో నిరుద్యోగ యువతను టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండగా..అమాయకులు అనేకమంది వారి వలలో పడి డబ్బులు పోగొట్టుకుని కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా రైల్వేల్లో, ఆర్టీసీల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ మాదిరిగా ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ మోసం చేస్తూ ఉంటారు కొందరు దళారులు.

ఈ మేరకు కొన్ని సంఘటనలు తమ దృష్టికి వచ్చినట్లుగా వెల్లడిస్తూ.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గ్రహించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో విడుదలయ్యే నోటిఫికేషన్ల వివరాలన్నీ ఆర్‌ఆర్‌బీ అధికార వెబ్‌సైట్‌లో ఉంటున్నట్లు చెప్పిన అధికారులు.. జరుగుతున్న మోసాలను ముందే పసిగట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని, రైల్వే ఉద్యోగాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ముంబైకి వెళ్లే ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముంబై-ఆదిలాబాద్‌, ఆదిలాబాద్‌-ముంబై, సికింద్రాబాద్‌-ముంబై, ముంబై- సికింద్రాబాద్‌, హెచ్‌ఎస్‌ నాందేడ్‌-ముంబై, ముంబై-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ రైళ్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.