Senior Congress Leader VH slam party working president Revanth Reddy : కాంగ్రెస్ పార్టీకి, సోనియా కుటుంబానికి వీర విధేయుడైన పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు పార్టీ అధిష్టానం పైనా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పార్టీ అధిష్టానం గత రెండేళ్లనుంచి ఎన్నిసార్లు అడుగుతున్నా తనకు అపాయింట్ మెంట్ ఇవ్వటంలేదని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రంలోని కొంత మంది నాయకులు నాపై హై కమాండ్ కు చెడుగా చెప్పారని అన్నారు. వరుస పరాజయాల పాలవుతున్నా పార్టీ లో రివ్యూ జరగటం లేదని ఆయన అన్నారు.
హైకమాండ్ నన్ను అవమానించిందని ఆయన అన్నారు. పార్టీలో బీసీ నాయకులను పట్టించుకోవటం లేదని…. పార్టీ అధ్యక్షురాలు సోవియాగాంధీకి సమాధి కట్టినోడికి పీసీసీ పదవి కట్టబెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్,టీడీపీ లోంచి పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు చూస్తూంటే హై కమాండ్ తో తాడోపేడే తేల్చుకోటానికి సిధ్దమైట్లు కనిపిస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రేవంత్ రెడ్డి పై ఇప్పటికే చాలా కేసులున్నాయని… టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ గురించి నిజాలు చెప్పకుండా దాచి పెట్టాడని… ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లివచ్చిన సంగతి అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేశారు.
రేవంత్ పై ఓటుకు నోటు, మనీ లాండరింగ్ కేసు లు ఉన్నాయని, రేవంత్ తమ్ముడు హరిజనుల భూకబ్జాలకు పాల్పడ్డాడడని….ఆయన మూలంగా షేక్ పేట తహసిల్దార్ సస్పెండ్ అయ్యాడని వివరించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనూ, ఢిల్లీ స్ధాయిల్లోనూ మీడియాను మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమేపి అగ్రకులాల పార్టీగా మారుతోందని బడుగు బలహీన వర్గాల వారిని దూరం చేస్తున్నారని… ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కాదని మూడు పార్టీలు మారి, తెలంగాణకు బద్ద శత్రువైన రేవంత్ కు టీపీసీసీ పదవి ఇవ్వటం దారుణమని అన్నారు.
రేవంత్ కు పీసీసీ ఇస్తే కాంగ్రెస్ నాయకులంతా చర్లపల్లివెళ్ళి రేవంత్ ను కలవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు రాహుల్, సోనియాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. కొడంగల్ లో ఓడిపోయినవాడికి… మల్కాజ్గిరి ఎంపీ సీటు ఇచ్చారని… అది చూసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఇంత వరకు ఒక్క చోట కూడా పార్టీని గెలిపించలేక పోయారని అన్నారు. డి.శ్రీనివాస్ పీసీసీ గా ఉన్నప్పుడు రెండుసార్లు పార్టీని అధికారంలోని తెచ్చారని… కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేస్తే… తెలంగాణ ఇవ్వవద్దని పోరాటం చేసిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఎలా ఇస్తారని వీహెచ్ దుయ్యబట్టారు.
గత కొన్నాళ్లుగా మానిక్ ఠాకుర్ ను అపాయింట్ మెంట్ ఇవ్వమంటే ఇవ్వటంలేదని తెలిపారు. తాను మాజీ పీసీసీ అధ్యక్షుడనని..ఇందిరా గాంధీ లాంటి నాయకులతో పార్టీని తెలంగాణలో బలోపేతం చేసానని వీహెచ్ చెప్పారు. ఢిల్లీ వాళ్లు ఏది చెపితే అది మేము వినాలని అనుకుంటున్నారని ఆ పద్దతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. షబ్బీర్ ఆలీ గతంలో ఎంఐఎంకు మద్దతు ఇచ్చాడని…ఇప్పడు ఆర్ఎస్ఎస్ కు మద్దతు ఇస్తున్నాడని ఇలాంటి వారికే పార్టీ అధిష్టానం పట్టం కడుతోందని ఆవేశంగా అన్నారు. పండిట్ నెహ్రూ నాటి నుంచి నేటి సోనియా వరకు ఆర్ఎస్ఎస్ కు బధ్ధ శత్రువులమని… ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారికి టీపీసీసీ ఎలా ఇస్తారని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి అతి తక్కువ సమయంలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.ఈ విషయమై విచారణ జరపాలని సీబీఐ కి లేఖ రాస్తానని ఆయన హెచ్చరించారు. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని లేదా ఒరిజినల్ రెడ్డి కులస్తులకు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కంటే నాకే ఎక్కువ ప్రజాదరణ ఉందని వీహెచ్ చెప్పుకొచ్చారు. సోనియాగాంధీకి సమాధికట్టిన రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ఆయన ఆవేశంగా ప్రశ్నించారు.
24 శాతం ఉన్న ఎస్సీఎస్టీ బీసీలను అధిష్టానం ఎందుకు పరిగణలోకి తీసుకోదని ఆయన అడిగారు. నువ్వునిక్క రేసుకున్నప్పటికే నేను నాయకుడినని… ఇంత తక్కువ కాలంలో నువ్విన్ని కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని..లేకపోతే సీబీఐకి లేఖ రాస్తానని నిన్నువదిలిపెట్టనని వీహెచ్ రేవంత్ రెడ్డి ని హెచ్చరించారు. మొత్తానికి విమర్శలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.