Seshachalam Forest: షాకింగ్.. గుప్తనిధుల కోసం ఏడాదికి పైగా సొరంగం తవ్వకాలు!

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. అసలే కరోనా సమయం కావడం.. జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల పేరిట భారీ తవ్వకాలకు దిగారు.

Seshachalam Forest: చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. అసలే కరోనా సమయం కావడం.. జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల పేరిట భారీ తవ్వకాలకు దిగారు. ఏడాదికి పైగా ఏకంగా 80 అడుగుల మేర సొరంగాన్ని తవ్వేశారు. ఏడాదికి పైగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ముంకు నాయుడు అనే వ్యక్తిని ఈ తవ్వకాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతనితో పాటు మరో ఆరుగురు కూలీలను అరెస్ట్ చేశారు. ఓ స్వామీజీ మంగళం బీటీఆర్‌ కాలనీ పైభాగంలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని కొండ వద్ద గుప్తనిధులు ఉన్నాయని చెప్పడంతో ఈ తవ్వకాలు జరిపినట్లుగా నిందితుడు అంగీకరించగా ఏడాది కాలంగా ఈ సొరంగాన్ని తవ్వినట్లు విచారణలో మంకు నాయుడు చెప్పాడు.

మనుసులు నడుచుకుంటూ వెళ్లేంతగా భూమి లోపల అంత పెద్ద సొరంగాన్ని చూసిన పోలీసులు షాక్ అవగా.. ఈ సొరంగాన్ని ఎలా తవ్వారనే అంశంపై దృష్టి పెట్టారు. 120 అడుగుల మేర సొరంగాన్ని తవ్వాలని స్వామీజీ చెప్పిన మాటలను నమ్మిన నిందితులు ఏడాది కాలంగా 80 అడుగుల సొరంగాన్ని తవ్వేశారు. స్వామీజీ చెప్పినట్లుగా ఏ ప్రాంతంలో ఈ నిధులు ఉన్నట్లుగా భావిస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

కాగా మంకు నాయుడుకు నిధులు ఉన్నాయని చెప్పిన స్వామీజీ గత ఆరు నెలల క్రితమే చనిపోగా ఆయన చెప్పినట్లుగా మంకు నాయుడు నిధుల పిచ్చితో భారీ ఖర్చుతో ఏడాది కాలంగా ఈ ముఠాతో తవ్వకాలు జరిపిస్తున్నాడు. అయితే.. తరచుగా మనుషులు అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అనుమానించిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ తవ్వకాలు వెలుగులోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు