Seven Foot Statue Of Cm Kcr In Kaleswaram At Lakshmi Barrage
Lakshmi Barrage: కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్నది సీఎం కేసీఆర్ కల. దానికోసమే రాష్ట్రానికి మించిన భారమే అయినా వెనక్కి తగ్గకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద పంటలు పండించే రైతులు, బ్యారేజీలు నిర్మించిన సమీప గ్రామాల ప్రజలు సీఎంను జలస్వప్నికులు కొనియాడుతుంటారు. కాగా, ఇప్పుడు ఏకంగా కాళేశ్వరంలో కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు పూనుకుంటున్నారు.
ప్రాజెక్ట్‌కు గుండెకాయలా నిలిచిన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ వద్ద ఏడడుగుల కేసీఆర్ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి ఈ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. విగ్రహ ఏర్పాటు కోసం తాజాగా లక్ష్మిబ్యారేజ్ ను సందర్శించిన ఈ ఇద్దరు విగ్రహ ఏర్పాటుకు స్థలం పరిశీలించి బరాజ్ సమీపంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ధారించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలవుతున్న లక్ష్మీబరాజ్ వద్ద కేసీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తెలిపారు. కాగా, ఇప్పటికే విగ్రహాన్ని తయారుచేయించి అంబట్‌పల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు నివాసంలో ఉంచగా అతి త్వరలోనే విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు.