Shatabdi Express
Shatabdi Express: ఒంటెను ఢీకొనడంతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటలకు పైగా నిలిచిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో జరిగింది. ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బేతంపూర్ సమీపంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు, పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఒంటెను ఢీకొంది. దీంతో ఒంటె శరీరం ముక్కలుముక్కలైంది. ఈ క్రమంలో ఒంటె శరీర భాగాలు కొన్ని రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో ట్రైన్ అక్కడికక్కడే నిలిచిపోయింది.
తర్వాత రైల్వే సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి, ఇంజిన్‌లో ఇరుక్కున్న శరీర భాగాలను బయటకు తీశారు. అనంతరం రైలు తిరిగి ప్రయాణమైంది. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.