Sileru River: మరో రెండు మృతదేహాలు లభ్యం.. గల్లంతైన ఎనిమిది మందీ మృతి!

రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. చివరికి ఆ బతుకు పోరాటంలోనే ముగిసిపోయాయి. సోమవారం రాత్రి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు సీలేరు నదిలో పడవలు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

Sileru River

Sileru River: రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. చివరికి ఆ బతుకు పోరాటంలోనే ముగిసిపోయాయి. సోమవారం రాత్రి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు సీలేరు నదిలో పడవలు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. లభ్యమైన మృతదేహాలను లాక్షి (22), పింకీ (4)లుగా బంధువులు గుర్తించారు. సోమవారం రాత్రి సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. అన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతులంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామానికి చెందినవారుగా తెలియగా.. వారు హైదరాబాద్ శివారులో ఇటుకల బట్టిలో పనికి వెళ్లారు. అయితే తెలంగాణలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులతో తిరిగి స్వస్థలానికి వెళ్లే క్రమంలో ఒడిశా ప్రభుత్వం కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటే తప్ప రాష్ట్రంలోకి అనుమతించకపోవడంతో సీలేరు నదిపై నాటు పడవలను ఆశ్రయించారు. అయితే.. అనుకోకుండా చివరికి మృత్యు ఒడికి చేరారు. పడవలు నది మధ్యలోకి చేరుకున్న తర్వాత ఒక పడవలో నీళ్లు చేరగా భయపడి రెండో పడవలోకి వచ్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన రెండు పడవలు నీట మునిగాయి. ప్రమాదం సమయంలో పడవలలో ఒక పడవలో 11 మంది ఉన్నట్లు తెలియగా.. మరో పడవలో ఏడుగురు ఉన్నట్లు తెలిసింది. పడవలు మునిగిపోవడంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. మునిగిన వారిలో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా మరో 8 మంది గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు నిన్న లభ్యం కాగా మరో రెండు దేహాలు బుధవారం లభ్యమయ్యాయి. మరణించిన వారిలో ఆరుగురు చిన్నారులు కాగా వారి వయసు 6 ఏళ్ల లోపే కావడం గమనార్హం.