Sri Lanka
Sri Lanka: శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె ఈ నెలలో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సమావేశమై, శ్రీలంకకు ఆర్థిక సాయం చేయాలని కోరతారని శ్రీలంక మీడియా తెలిపింది. శ్రీలంక ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, ఇదివరకే శ్రీలంకకు చాలా సాయం చేసింది. గత జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు బిలియన్ డాలర్ల వరకు సాయం చేసిందని అంచనా. వచ్చే నెల కోసం మరో 500 మిలియన్ డాలర్ల సాయం అందించబోతుంది. చమురు, అత్యవసర వస్తువుల కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగపడతాయి.
SriLanka PM Ranil Wickremesinghe : శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రణిల్ విక్రమసింఘే
రెండు రోజుల క్రితమే శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విక్రమ సింఘె, భారత్ చేస్తున్న ఆర్థిక సాయానికి గాను ధన్యవాదాలు తెలిపారు. భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. భారత్ కూడా శ్రీలంక కొత్త ప్రధానితో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక అత్యవసర స్థితి కొనసాగుతోంది. చమురు, ఆహారం, మందులు వంటివి కూడా దొరకడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా స్తంభించిపోయింది. దీంతో ప్రజలు శ్రీలంక ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.