హీరో సుశాంత్ మృతికి కారణం అదే, పోస్టుమార్టం రిపోర్టు

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మ‌హ‌త్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి

  • Publish Date - June 15, 2020 / 05:40 AM IST

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మ‌హ‌త్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మ‌హ‌త్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వచ్చినా ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే వాదనలు వినిపించాయి. ఇది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన మామ అనడం మరిన్ని సందేహాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. ఈ రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోస్టుమార్టం రిపోర్టులో ఏమొస్తుందా అని అంతా ఎదురుచూశారు. చివరకు సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. 

సుశాంత్‌ది ఆత్మహత్యే, ఉరి కారణంగానే మరణం:
సుశాంత్ ది ఆత్మహత్యే అని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఉరి కారణంగా సుశాంత్ మరణించాడని రిపోర్టులో ఉంది. సుశాంత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే శరీరంలో విషపూరితాలు ఏమైనా ఉన్నాయో లేదో టెస్ట్ చేసేందుకు అవయవాలను జేజే ఆసుపత్రికి పంపారు. అసలు సుశాంత్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనేది అంతు చిక్కడం లేదు. పెద్ద మిస్టరీగా మారింది. పోలీసులు ఆ మిస్టరీని ఛేదించే పని ఉన్నారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమనే వార్తలూ వినిపిస్తున్నాయి. దీంతో సుశాంత్ సూసైడ్ కేసుని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, సుశాంత్ ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదు. సోమవారం(జూన్ 15,2020) డాక్టర్ ఆర్‌ఎన్ కోపర్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌లో సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 

మంచి భవిష్యత్తున్న యువ నటుడు:
‘ధోనీ’ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఇక లేరనే వార్త బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు పొందిన సుశాంత్‌(34) అర్ధాంతరంగా తనువు చాలించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. బుల్లితెరపై, వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన సుశాంత్‌.. ఆత్మహత్య చేసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. బాంద్రాలోని అపార్ట్‌మెంట్‌లో  ఆదివారం(జూన్ 14,2020) సుశాంత్ సీలింగ్ కు వేలాడుతూ కనిపించారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ నటుడు ఇలా తనువు చాలించడంపై విచారం వ్యక్తమవుతోంది. 

6 నెలలుగా డిప్రెషన్‌లో:
కాగా గత ఆరు నెలలుగా సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నట్టు పోలీసులు విచారణలో తెలిసింది. దర్యాఫ్తులో భాగంగా సుశాంత్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు సుశాంత్ కి చెందిన కొన్ని వస్తువులను, మెడికల్ రిపోర్టులను తమతో తీసుకెళ్లారు. వాటి ఆధారంగా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఆశిస్తున్నారు. సుశాంత్ మరణ వార్త తెలిసిన వెంటనే పాట్నా నుంచి బయలుదేరిన కుటుంబసభ్యులు ముంబైకి చేరుకున్నారు. సుశాంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మేనేజర్ దిశా ఆత్మహత్య చేసుకున్న 5 రోజులకే:
జూన్ 9న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుశాంత్ సింగ్‌తో సహా మరో నలుగురు స్టార్స్ దగ్గర కూడా ఈమె మేనేజర్‌గా పని చేసింది. ఈమె ముంబైలోని మలాడ్‌లో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్స్‌లోనే 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన 5 రోజులకు(జూన్ 14,2020) సుశాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఈ రెండు మరణాలకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. అంత మంచి కెరీర్ ఉన్నపుడు ఎందుకు ఇలాంటి మూర్ఖపు నిర్ణయం తీసుకున్నాడు అనేది అంతుచిక్కని ప్రశ్న.