Policeslapgirl (2)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రిలో మాత్రం మెజారిటీ వార్డులను దక్కించుకోలేకపోయింది. అయితే ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారడంతో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక రసవత్తరంగా మారగా.. ఎక్స్‌అఫీషియో ఓటు కోసం టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మరో ముగ్గురు వైసీపీ అభ్యర్థులు పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించారు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డి.
ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్, శమంతకమణికి ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత ఉంటుందని వెల్లడించారు. తాడిపత్రి మున్సిపల్‌లో 36 వార్డులు ఉండగా.. రెండు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరిగితే.. అందులో టీడీపీ 18వార్డులు, వైసీపీ 14వార్డులు దక్కించుకోగా.. సీపీఐ, స్వతంత్రులు తలా ఒకటి గెలుచుకున్నాయి.
సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకే సపోర్ట్ చేస్తోండగా.. వైసీపీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దాంతో ఆ పార్టీబలం 18కి చేరుకుంది. టీడీపీ సొంతబలం 18గా ఉంది. సీపీఐ, స్వతంత్రులనూ జేసీ పవన్‌రెడ్డి ప్రత్యేక శిబిరానికి తరలించగా.. టీడీపీ బలం 20గా ఉందని చెబుతున్నారు.