పద్యాలు చెప్పండీ..ఫ్రీగా పెట్రోల్ పోయించుకోండి..ఆఫర్ ఎప్పటివరకూనంటే..

Tamilnadu petrol bunk owner free fuel to who recite poems : గతంలో చిన్నారుల్ని దగ్గర కూర్చోపెట్టుకుని తాతయ్యలు ‘ఓ పద్యg చెప్పరా నీకు మిఠాయిలు కొనిపెడతాను’ అని ఆశపెట్టి పద్యాలు చెప్పించుకునేవారు. వారికి రాకపోతే మిఠాయి కొనిపెడతానని ఆశపెట్టి పద్యాలు నేర్పించేవారు. కానీ ప్రస్తుతం చదువులు ‘ఇంగ్లీషు’ చదువులే. దీంతో పిల్లలకు పద్యాలు రావటంలేదు. ఈక్రమంలో తమిళనాడుకు చెందిన ఓ సాహిత్యాభిమాని వాహనదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ‘‘ పద్యాలు చెప్పండీ..ఫ్రీగా పెట్రోల్ పోయించుకెళ్లండీ’’ అంటూ మాతృభాష (తమిళ సాహిత్యం)పై ఉండే మమకారంతో ఇటువంటి వినూత్న ప్రకటన చేశారు ‘సెంగుట్టవన్’ అనే ఓ సాహిత్యాభిమాని.

 

పద్యాలకు కొత్త తరాన్ని దగ్గర చేయటానికి సెంగుట్టవన్ ఇటువంటి వినూత్న ప్రకటన చేశారు. సెంగుట్టవన్ వళ్లువర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సాహిత్యం అంటే ప్రాణం. వాహనదారులు తమ చిన్నారుల్ని తీసుకువచ్చి ‘ఓ పద్యం చెబితే చాలు…ఉచితంగా పెట్రోల్ పోస్తామంటూ ప్రకటించారు. తమిళుల ఆరాధ్యుడు తిరువళ్లువర్ రచించిన తిరుక్కరళ్ గ్రంథంలోని పద్యాలను చెప్పిన వారికే ఈ ఆఫర్ అని ప్రత్యేకించి చెబుతున్నారు.

ప్రముఖ కవి తిరువళ్లువర్ రచించిన ‘తిరుక్కరళ్’ ప్రస్తావన లేనిదే తమిళ సాహిత్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన రాసిన ఆ గ్రంథానికి అంతం పేరు..ప్రాముఖ్యత ఇది. రాజకీయం, ఆర్థికం, నైతికత, ప్రేమ వంటి అనేక మానవజీవన పార్శ్వాలపై 1330 పద్యాలు ఈ ‘తిరుక్కరళ్’ గ్రంథంలో ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని మనసా వాచా కర్మణా పాటిస్తే మానజీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అంతటి పరమార్థం ఉండే ఈ పద్యాలు నేర్చుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్యాలంటే తమిళ ప్రజానీకానికి అమితమైన అభిమానం. సహసంగానే తమిళులు తమ మాతృభాష మీద ఎంతో మమకారం..గౌవరం చూపిస్తుంటారనే విషయం తెలిసిందే.

సెంగుట్టవన్ కూడా ఈ కోవలోకే వస్తారు. ఆయనకు తమిళ భాష అంటూ ప్రాణం కంటే ఎక్కువ. సెంగుట్టవన్ కే కాదు ఆయన కుటుంబానికీ తిరువళ్లువర్ అన్నా..ఆయన రచించిన తిరుక్కరళ్ అన్నా మాటల్లో చెప్పలేనంత గౌరవాభిమానాలు. కుటంబంలో అందరూ ఈ పద్యాలను చక్కగా నేర్చేసుకున్నారు. అర్థరాత్రి లేపి అడిగినా అనర్గళంగా చెప్పేస్తారు.

62 ఏళ్ల కె.వళ్లువర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సెంగుట్టవన్..కరూర్‌కు సమీపంలోని నాగంపల్లి ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ ఉంది. ఆ బంక్ పేరు కూడా ‘వళ్లువర్’ అనే పెట్టుకున్నారు అంటూ ఆయనకు ‘తిరువళ్లువర్‘ అంటే ఎంత ప్రాణమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రోజుకొరతీరుగా పెట్రోలు ధరలు పెరుగుతున్న క్రమంలో దాన్ని సాహిత్యాభిమానానికి ఉపయోగించాలనుకున్నారు సెంగుట్టవన్. దీంట్లో భాగంగానే..‘పద్యాలు చెబితే..పెట్రోల్ ఉచితం’ అనే ఆఫర్.

ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే తిరుక్కరళ్‌లో ఉన్న పద్యాల్లో కనీసం 20 చెబితే లీటర్ పెట్రోలు, 10 చెబితే అర లీటర్ పెట్రోలు ఫ్రీగా పోస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన బాగా వైరల్ కావటంతో ఫ్రీ పెట్రోల్ కోసం..తల్లిదండ్రులు తమ పిల్లలకు తిరుక్కరళ్ పద్యాలు నేర్పించేస్తున్నారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 200ల మంది విద్యార్దులకు పైగా ఈ పద్యాలను నేర్చుకున్నారని ఆనందం వ్యక్తంచేస్తున్నారు సెంగుట్టవన్.

దీంతో ‘వళ్లువర్’ పెట్రోల్ బంక్‌కు తీసుకొచ్చి తమ పిల్లలతో పద్యాలు చెప్పించి ఫ్రీగా పెట్రోల్ పట్టుకెళుతున్నారు. విద్యార్ధులంతా ‘తిరువళ్లువర్‘ పద్యాలు కంఠతా నేర్చుకోవాలని..ఆ పద్యాలను అర్థం చేసుకుని తద్వారా వారి జీవితాలకు సార్థకం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు సాహిత్యాభిమాని సెంగుట్టవన్. కాగా..ఈ ‘పద్యాలు చెబితే ఫ్రీ పెట్రోల్‘‘అనే ఆఫర్ ఏప్రిల్ 30 వరకూ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఉచిత పెట్రోల్ విషయం అటుంచితే..పిల్లల్లో సాహిత్యాభిరుచి పెంచేందుకు సెంగుట్టవన్ చేస్తున్న వినూత్న ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు