ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాములోరిపై రాజకీయం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య నడుస్తోంది. రామతీర్థంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అవగా..విజయనగరం జిల్లాలో ఉద్రక్త వాతావరణం చోటుచేసుకుంది.
రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్ 28వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి కొలనులో పడేశారు. దీనిపై రాజకీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి ఒకే రోజు రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. ఈ సమయంలో కొండ కింద ప్రాంతంలో రామ నామస్మరణతో పోటాపోటీ నినాదాలు చేశారు తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తలు.
విజయసాయిరెడ్డి కొండకిందకు వచ్చి కారులో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు పగిలాయి.