Rajastan
Barmer Teachers కరోనా నేపథ్యంలో స్కూల్స్ మూతబడటంతో చాలా రాష్ట్రాలు.. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాలేక ఇబ్బందులెదుర్కొంటున్న విద్యార్థులక కోసం రాజస్థాన్‌లోని బార్మెర్‌కు చెందిన టీచర్లు.. ఒంటెలపై ప్రయాణించి మొబైల్ నెట్‌వర్క్‌లేని ఎడారి ప్రాంతాల్లోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి వారి ఇంటి వద్దనే పాఠాలు చెప్పారు. ఈ ఉపాధ్యాయుల చొరవను విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు. కాగా, టీచర్లు ఒంటెలపై విద్యార్థుల ఇళ్లకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఉపాధ్యాయుల బృందానికి అభినందనలు తెలిపిన భీమ్తాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ రూప్ సింగ్ జాకడ్..భవిష్యత్తులో కూడా దీనిని మరింత కొనసాగించాలన్నారు.
ఇక, రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్ధుల్లో చాలా మందికి మొబైల్ ఫోన్లు లేవని,కాబట్టి 1-8 తరగతుల విద్యార్ధుల కోసం టీచర్లు వారానికి ఒకసారి విద్యార్ధుల ఇళ్లకు,9-12తరగతుల విద్యార్ధుల ఇళ్లకు వారానికి రెండు సార్లు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాజస్తాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరక్టర్ సౌరవ్ స్వామి తెలిపారు.