తెలంగాణ బ్రాండ్ తో మాంసం అమ్మకాలు..తక్కువ ధరకే మటన్..

Telangana Brand Mutton: సామాన్యుడు మార్కెట్‌ కెళ్లి మటన్ కొనే పరిస్థితులు లేవు. కిలో మటన్ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్మతున్నారు. మటన్ తినాలనే కోరిక ఉన్నా..అంత రేటు పెట్టి కొనే పరిస్థితి లేక చికెన్, చేపలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సామాన్యులకు అందనంత స్థాయిలో మటన్ రేట్లు ఉంటున్నాయి.

దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు కూడా మటన్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. మార్కెట్లో రూ.700 నుంచి రూ.1000 వరకు మటన్ అమ్ముతుండటంతో తెలంగాణ ప్రభుత్వ ‘తెలంగాణా బ్రాండ్‌’తో నాణ్యమైన మాంసం విక్రయాలను త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

శుక్రవారం (జనవరి 5)మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అధికారులు, పశువైద్యుల నూతన సంవత్సర డైరీని, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించిన సందర్భంగా తలసాని మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్షీర, నీలి, గులాబీ విప్లవాలు తీసుకొచ్చామని తెలిపారు. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీతో పెద్ద ఎత్తున గొర్రెలు, మత్స్య సంపద పెరిగిందని..దీంతో మాంసం ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయని వెల్లడించారు.

అపారమైన సంపదను సృష్టించి పేదలకు పంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని..దీంట్లో భాగంగానే త్వరలో తెలంగాణ బ్రాండ్ తో మాంసం విక్రయాలు ప్రారంభించనున్నామని తెలిపారు. అతి తక్కువ ధరలకే..మటన్ ను విక్రయిస్తామని తెలిపారు. మార్కెట్లలో మటన్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని దీంతో సామాన్యులకు మటన్ అందుబాటు ధరలో లేదని..తెలంగాణ బ్రాండ్ తో త్వరంలో మటన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు