CM KCR Birthday..golden saree to balkampet amma : తెలంగాణ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుక సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర సమర్పించారు. రెండున్నర కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన చీరను అమ్మవారికి బహూకరించారు.
ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, తొమ్మిది గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం నిర్వహించారు. అన్నప్రసాద పంపిణీ కూడా చేశారు. అలాగే సికింద్రాబాద్ లో కొలువైన ఉజ్జయినీ మహంకాళి, సికింద్రాబాద్ గణేష్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళసై..మంత్రి హరీష్ రావులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పలువురు ప్రముఖులు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో జలవిహార్‌లో జరిగే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన జీవన ప్రస్థానంపై రూపొందించిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ఐదు ప్రత్యేక గీతాలను కేటీఆర్ విడుదల చేశారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇలా కేసీఆర్ బర్త్ డే సందర్బంగా రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరుస్తోంది. మంత్రులు..పార్టీ శ్రేణులు వారి వారి నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.