Govenor Tamilisai -TS Govt : మంత్రి రాజ్ భవన్‌కు వస్తేనే పెండింగ్ బిల్లుపై చర్చిస్తా : గవర్నర్ తమిళిసై

యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు అంశంపై గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్ కు వస్తే చర్చిస్తామని స్పష్టంచేశారు తమిళిసై. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Telangana governor tamilisai letter to government regarding common universities recruitement board

Govenor Tamilisai-TRS Govt : మీకో టైమ్ వస్తే నాక్కూడా ఓ టైమ్ వస్తుందన్నట్లుగా ఉంది తెలంగాణ గవర్నర్ తమిళిసై స్టైల్. గత కొంతకాలంలో కేసీఆర్ ప్రభుత్వానికి..రాజ్ భవన్ కు మధ్య కోల్డ్ వార్ కాస్తా బహిరంగ విమర్శలతో కొనసాగుతునే ఉంది. గవర్నర్ ప్రసంగంలేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంటే.. సభలో ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో తమిళిసై ప్రభుత్వం పంపించిన పలు బిల్లులను పెండింగ్ లో పెట్టి ఉంచారు. ఇలా ఎవరికి టైమ్ వచ్చినప్పుడు వారు వారి వారి మార్కు చూపించుకుంటున్నారు. ఈక్రమంలో యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు అంశంపై గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్ కు వస్తే చర్చిస్తామని స్పష్టంచేశారు తమిళిసై. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుపై ఈ లేఖలో పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు వచ్చి బిల్లుపై చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు. ఇదే అంశంపై యూజీసీకి(UGC) కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చేయడంపై యూజీసీ అభిప్రాయం కోరారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని మూడేళ్లుగా చెబుతున్నానని అన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రస్తావించారు.

ప్రస్తుతం తెలంగాణలోని ఉభయ సభలు ఆమోదించిన అనేక బిల్లులు గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తెలంగాణ యూనివర్శిటీలకు కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, ములుగులోని అటవీకళాశాల, పరిశోధానా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్‌ చేసే బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా (టెర్మినేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ లీజెస్‌) సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌యాన్యూయేషన్‌) అమెండ్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ మోటర్‌ వెహికల్స్‌ ట్యాక్సేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ఉన్నాయి.

ఈక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు అంశంపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్‌కు రావాలని గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో సూచించారు. మరోవైపు రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ఈ బిల్లుల అంశంపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదేనని..గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలు ఉంటాయని తేల్చి చెప్పారు.

శాసనసభ ఆమోదించిన పలు బిల్లులు ఇంకా రాజ్‌భవన్‌ ఆమోదం తెలుపలేదని ఇది గవర్నర్ కావాలనే పెండింగ్ లో పెట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన గవర్నర్ తమిళిసై బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో తన పరిధిలో తాను నడుచుకుంటానన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టంచేశారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, గవర్నర్‌గా బాధ్యతాయుతంగా నిర్ణయాలు వెలువరిస్తానని స్పష్టం చేశారు.