Telangana Health Ministry: మంత్రులకు కలిసిరాని ఆరోగ్యశాఖ.. అప్పుడు రాజయ్య.. ఇప్పుడు ఈటల!

రాజకీయాలను సెంటిమెంటును విడదీసి చూడలేం. దాదాపుగా ఎక్కువ మంది రాజకీయ నేతలు ముహుర్తాలు, సెంటిమెంట్లను నమ్మేవాళ్లే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అయితే నేతలకు ఇది మరికాస్త ఎక్కువే ఉంటుంది. తెలంగాణలో భూకబ్జా ఆరోపణలతో వైద్యారోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.

Telangana Health Ministry: రాజకీయాలను సెంటిమెంటును విడదీసి చూడలేం. దాదాపుగా ఎక్కువ మంది రాజకీయ నేతలు ముహుర్తాలు, సెంటిమెంట్లను నమ్మేవాళ్లే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో అయితే నేతలకు ఇది మరికాస్త ఎక్కువే ఉంటుంది. తెలంగాణలో భూకబ్జా ఆరోపణలతో వైద్యారోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేయగా.. అసలు ఈ శాఖలోనే ఎందుకిలా జరుగుతుంది.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రులకు కలిసి రావడం లేదా అనే నమ్మకాలు, విశ్వాసాలపై రాజకీయ వర్గాలలో మరోసారి చర్చకు దారితీస్తుంది.

తెలంగాణ రాష్ట్రవైద్యారోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించి ఉద్వాసనకు గురైన మంత్రిగా ఈటల రాజేందర్ రెండో వ్యక్తి. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో డాక్టర్ రాజయ్యపై వేటు పడగా తాజాగా ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు. 2014లో కేసీఆర్ కేబినెట్లో ఉన్న డాక్టర్ రాజయ్య ఉపముఖ్యమంత్రి హోదాలో వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్నెళ్ల పాటే రాజయ్య ఆ పదవిలో ఉండగా సీఎం కేసీఆర్ ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి కడియం శ్రీహరిని కేబినెట్లోకి తీసుకున్నారు. తర్వాత 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను సీనియర్ నేత ఈటలకు అప్పగించారు.

ఈటల మంత్రివర్గంలోకి వచ్చిన కొన్ని నెలల నుండే ఆయనను తొలగిస్తారని ప్రచారం జరుగుతూనే వచ్చింది. కానీ, ఎప్పటికప్పుడు బర్తరఫ్ వాయిదా పడుతూరాగా ఇప్పుడు భూకబ్జా ఆరోపణలతో ఆయనను తొలగించేశారు. ఒకవిధంగా ఈటలకు పరిస్థితులు తొలినుండి ఏ మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పుకోవచ్చు. అప్పటినుండి ఉదంతాలు చూస్తే దినదిన గండంగానే గడుస్తూ వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు ఉద్వాసన జరిగిపోయింది. దీంతో ఇప్పుడు అసలు వైద్యశాఖనే మంత్రులకు కలిసిరావడం లేదనే ప్రచారం మొదలైంది.

ఇంతకుముందు ఉమ్మడి ఏపీలో మంత్రుల శాఖలకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఉండేది. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎవరికీ రాజకీయంగా కలిసి రాలేదు. ఆశాఖ మంత్రిగా పనిచేసిన పలువురు నేతలు తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం.. లేదంటే పదవులు దక్కకపోవడం ఉండేదని చెప్పుకుంటారు. అందుకే అప్పట్లో ఆ శాఖ బాధ్యతలు తీసుకోవాలంటేనే కాస్తా వెనకా ముందూ ఆలోచించే వాళ్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ తరహా సెంటిమెంట్ వైద్య, ఆరోగ్య శాఖలో కనిపిస్తుందని రాజకీయ ప్రముఖులు విశ్లేషించుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు