తెలంగాణలో కీలక పోరు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Telangana Mlc

తెలంగాణలో మరికాసేపట్లో కీలక పోరు ప్రారంభంకానుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రచారంతో ఊదరగొట్టిన అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలేట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు ఓటర్లు. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్… ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. రెండు స్థానాల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి 93మంది.. ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు జంబో బ్యాలెట్‌ను సిద్ధం చేశారు. ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 10 లక్షలకు పైగా ఓటర్లున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రౌండ్ లెవెల్‌లో పార్టీల నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. నగదు, మద్యం, స్వీటు బాక్సులు, క్రికెట్‌ కిట్లు చివరకు మేకలు కూడా పంపిణీ చేస్తూ వల విసురుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీల నాయకులు వివిధ సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి హామీలిస్తూ… గంపగుత్తగా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఓటర్లను విడివిడిగా బుట్టలో వేసుకునే పనిలో క్షేత్రస్థాయి కేడర్‌ రంగంలోకి దిగిపోయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీ జోరుగా కొనసాగుతోంది. పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా కొందరు అభ్యర్థులు సాధారణ ఎన్నికల స్థాయిలో ఖర్చుచేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడట్లేదు. ఒక్కో ఓటుకు 5 వేల వరకు కూడా డబ్బు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.. ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ ఓటేస్తే డబ్బులిస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తమకు భయమేమీ లేదని… ఆఫ్‌ ది రికార్డ్ చెప్తున్నానని చెప్పడాన్ని బట్టి చూస్తేనే అభ్యర్థులు ఏ స్థాయిలో డబ్బులు పంపిణీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.