Animals : కరోనా వైరస్ ప్రమాదం పిల్లుల్లో అధికం

పిల్లుల్లో కంటే కుక్కల్లోనే కరోనా వైరస్ ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు అధికంగా ఉన్నట్లు యాంటి బాడీ పరీక్షల్లో నిర్ధారించారు.

Cat

Animals : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషులకే కాదు జంతువులకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది. ఇప్పటికే అనేక జంతు ప్రదర్శన శాలల్లోని జంతువులు కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగు చూడగా తాజాగా అనేక అధ్యయనాల్లో జంతువులకు కరోనా సోకే ప్రమాదం అధికమని తేలింది. న్యూయార్క్ కు చెందిన వెటర్నరీ బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హిన్హ్ లీ , ఆయన సతీమణి యూయింగ్ లియాంగ్ లు జరిపిన పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

తమ పరిశోధనలో భాగంగా కుక్కలు , పిల్లుల్లో కోవిడ్ ప్రభావంపై పరిశీలన జరిపారు. పిల్లుల్లో కంటే కుక్కల్లోనే కరోనా వైరస్ ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు అధికంగా ఉన్నట్లు యాంటి బాడీ పరీక్షల్లో నిర్ధారించారు. వారి పరిశోధన వివరాలు వైరలెన్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. పిల్లులకు కరోనా సోకినప్పటికీ వాటిలో వైరస్ ప్రభావిత లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తేల్చారు.

ఇదిలా ఉంటే చైనాలోని హార్బిన్ వెటర్నీరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వైద్య బృందం అధ్యయనంలో వైరస్ కు గురైన పిల్లులు ఇతర పిల్లులకు వ్యాప్తి చేసినట్లు గుర్తించారు. కుక్కల్లో ఇలాంటి వ్యాప్తి ఏమి లేదని తేల్చారు. కోళ్ళు, పందులు, బాతులు వైరస్ వచ్చే అవకాశంలేదన్న నిర్ధారణకు వచ్చారు. అయితే జంతువుల నుండి వాటి యజమానులకు కరోనా వైరస్ సంక్రమించే విషయంపై ప్రత్యక్ష అధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు.