There is no KCR without Siddipet : ‘సిద్దిపేట లేనిదే కేసీఆర్ లేడు..కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందని చెప్పారు. గురువారం (డిసెంబర్ 10, 2020) సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. హరీష్ రావుపై కేసీఆర్ ప్రశంసలు వర్షం కురిపించారు. సిద్దిపేటకు హరీష్ రావు లాంటి మంచి నేత ఉన్నాడని పేర్కొన్నారు. తన అంతటి నేతను మీకు అప్పగించానని వ్యాఖ్యానించారు. ఆణిముత్యం లాంటి హరీష్ ను సిద్దిపేటకు ఇచ్చానని చెప్పారు. హరీష్ రావు తన పేరు నిలబెడుతున్నాడని, సిద్దిపేటను అద్భుతంగా తీర్చిదిద్దాడని కొనియాడారు.
సిద్దిపేటలోనే కాదు..రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ సమస్య లేదని స్పష్టం చేశారు. గతంలో సిద్దిపేటలో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు. బోర్లు వేసినా నీళ్లు పడక రైతులు బాధపడేవారని చెప్పారు. వేసిన బోరు వేసినట్లే ఎండిపోయేదన్నారు. రంగనాయకమ్మసాగర్ తో నీటి ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. రంగనాయకమ్మసాగర్ ను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రంగనాయకమ్మసాగర్ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
22 గ్రామాల మీదుగా రింగ్ రోడ్ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేసీఆర్ చెప్పారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు 25 కిమీ ఫోర్ లేన్ రోడ్ నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు.
పట్టణంలో కొత్తగా నిర్మించిన కాలనీలో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట ఇండియాకే రోల్ మోడల్ గా ఉందని అభినందించారు. సిద్దిపేటకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సిద్దిపేటకు బస్తీ దవాఖానా మంజూరు చేస్తున్నామని చెప్పారు. నెల రోజులలోపే దవాఖానా ప్రారంభమవుతుందన్నారు. కోమటి చెరువు అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణ పరిధికి సరిపడేలా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.