Tirupati Ruia Hospital
Tirupati Ruia Hospital: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృతి చెందిన హృదయవిదారక ఘటన గురించి తెలిసిందే. అయితే, ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ ఘటనలో 50 మంది వరకు కరోనా బాధితులు మరణిస్తే.. కేవలం 11 మంది మాత్రమే చనిపోయారంటూ ప్రభుత్వం ప్రకటించిందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం దీనిని ఖండిస్తూనే ఉంది.
కాగా, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా స్పందించింది. రుయా ఘటనపై చింతా మోహన్, సుధాకర్ ఎన్ అనే వారు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆక్సిజన్ కొరతతో 11 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్తుండగా రుయాలో 30 మంది చనిపోయారని చింతా మోహన్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్… ఫిర్యాదులు నిజమైతే తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనేనని.. రుయా ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది. 4 వారాల్లో ఈ నివేదిక అందించాలని స్పష్టం చేసింది.
ఇక, మరోవైపు ఇదే ఘటనపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రుయా ఘటనలో యాభై మంది చనిపోతే కేవలం 11 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెప్తుందని జీబీపీ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. చనిపోయిన మృతుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలపగా వెంటనే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక వేసవి సెలవుల అనంతరం ఈకేసును విచారిస్తామన్న కోర్టు ఘటనపై ప్రభుత్వం మాత్రం వెంటనే నివేదికను అందించాలని పేర్కొంది.