కరోనా వైరస్ మహమ్మారి మరో ఎమ్మెల్యేని బలితీసుకుంది. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి
కరోనా వైరస్ మహమ్మారి మరో ఎమ్మెల్యేని బలితీసుకుంది. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో మృతి చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. మేలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్‌లో చేశారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆయన శ్వాసకోశ సమస్యలకు కూడా గురికావడంతో కోలుకోలేకపోయారని డాక్టర్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమ్మెల్యే ఘోష్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. చాలా విషాదకరమైన విషయం అన్నారు. ఫాల్టా(falta) నియోజకవర్గం నుంచి తమోనాష్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్‌గా పనిచేస్తున్నారని, తమది 35 ఏళ్ల అనుబంధం అని, ప్రజలు, పార్టీ కోసం ఆయన శ్రమించారని, సమాజ సేవకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని మమతా బెనర్జీ తెలిపారు.
కరోనాతో చనిపోయిన రెండో ఎమ్మెల్యే:
కాగా, కరోనాతో చనిపోయిన రెండో ఎమ్మెల్యే తమోనాష్. ఇటీవలే తమిళనాడుకు చెందిన డీఎంకే ఎమ్మెల్యే అనబళగన్ కూడా కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏపీలో ఒక వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ అయ్యింది. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఒక్కరోజే 15వేల 968 కరోనా కేసులు:
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బుధవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,968 పాజిటివ్ కేసులు వచ్చాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 56వేల 183కి చేరగా..ఒక్కరోజే వైరస్ తో 465 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 24 గంటల్లో 10,495 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 2,58,685 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1, 83, 022. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 14వేల 476కి చేరింది.
ఇప్పటివరకు 73.52 లక్షల కరోనా టెస్టులు:
కరోనా వైరస్ సోకిన వారిలో 2.58 లక్షల మంది ఇంతవరకు రికవర్ అయ్యారని, రికవరీ రేటు 56.7 శాతానికి చేరుకుందని కేంద్రం తెలిపింది. మంగళవారం 2లక్షల 15వేల 195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఒక రోజులో చేసిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదేనని ఐసీఎంఆర్ తెలిపింది. ఇంతవరకూ 73లక్షల 52వేల 911మందికి కరోనా టెస్టులు చేశామని వెల్లడించింది. యావరేజ్ పాజిటివ్ రేటు 7.42 శాతంగా ఉంది.