Today HeadLines: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టామని అగంతకుడు కాల్ చేశాడు. దీంతో ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చారు పోలీసులు.

14ఏళ్లు సీఎంగా ఉన్నా.. ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వలేకపోయారు
మండపేటలో చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్సీ త్రిమూర్తులు విమర్శలు గుప్పించారు. ”నేను వాసన పసిగట్టి గెలిచే పార్టీలోకి వచ్చానని మీరు చెప్పడం బాగుంది. ఎందుకంటే 2024 లో గెలిచేది వైసీపీ అని మీరే చెబుతున్నారు. రౌడీయిజం పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
జనం ఏమనుకుంటారోనని ఆలోచించుకోకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వలేకపోయారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించిన ఘనత సీఎం జగన్ ది” అని తోట త్రిమూర్తులు అన్నారు.

అయోధ్యకు చేరుకున్న పవన్ కల్యాణ్
శతాబ్దాల ఎదురుచూపులు ఫలించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రేపు అయోధ్యలో రామమందిరం ఆవిష్కరణ ఎంతో సంతోషకరం అన్నారు. దేశ ప్రజలు ఎంతో కాలం చేసిన ప్రార్థనల ఫలితంగా అయోధ్యలో మళ్లీ రామాలయం కొలువుదీరిందన్నారు. రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ అయోధ్యకు వెళ్లారు. రాత్రి అయోధ్యలోనే బస చేసి రేపటి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

బిల్లు కట్టొద్దంటే నాది విధ్వంసకర మనస్తత్వమా?
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం 4లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ కు 7-8 సీట్లు ఎక్కువ వచ్చుంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదన్నారాయన. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామని చెప్పారు. గత ఎంపీ ఎన్నికల్లో
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయామన్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దంటే తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ అధికార నేతలు అంటున్నారని, నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వం అంటారా అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. కరెంటు బిల్లులను సోనియా గాంధీకే పంపుతాము అంటూ పిలుపునిచ్చారు కేటీఆర్.

ముందు టికెట్ ఉంటుందో లేదో చూసుకో
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి సెంట్రల్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్. సెంట్రల్ నియోజకవర్గంలో 25వేల ఓట్ల మెజారిటీతో గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానన్నారు. పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. తాను విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షుడిగా పని చేశానని ఆయన గుర్తు చేశారు. నగరంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా బోండా ఉమ తనపై విజయం సాధించలేరని అన్నారు. నాపై గెలవడం సంగతి పక్కన పెడితే.. ముందు.. బోండా ఉమకు టికెట్ ఉంటుందో లేదో చూసుకోవాలన్నారు వెలంపల్లి శ్రీనివాస్.

మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్
అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. వెనకబడిన తరగతుల ఆద్యుడు పూలే అని, ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆదర్శం అని చెప్పారామె. ఆయన జయంతి అయిన ఏప్రిల్ 11 నాటికి విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాకు ఆహ్వానం అందలేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రేపు జరగనున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు తమకు ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అయితే, ఏదో ఒక రోజు అయోధ్య రాముడిని సందర్శిస్తామని ఆమె తెలిపారు.

చంద్రబాబుతో కలిసి అయోధ్యకు..
అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు వెళ్లనున్నారు. రేపు అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.

అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనకు వెళ్లే వారి కోసం రైల్వేశాఖ తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. జనవరి 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 3 వరకు అయోధ్య ధాం రైల్వే జంక్షన్‌కు సికింద్రాబాద్‌, ఖాజీపేట, జాల్నా నుంచి ఆస్థా స్పెషల్‌ సర్వీసులు నడవనున్నాయి.

సిరియాపై ఇజ్రాయిల్ దాడులు 
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. డమాస్కస్‌లో సిరియాకు చెందిన ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన డిప్యూటీతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు.

పెరిగిన బంగారం ధరలు 
బంగారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.10 గ్రాముల పసిడి 22 క్యారెట్ల ధర రూ. 100 పెరిగి రూ. 57,800కి చేరింది.

రేవంత్‌పై ఫైర్

బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. లండన్ లో తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఉండాలని వెకిలి మాటలు వద్దని హితవు పలికారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై ఫిర్యాదు
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రంజిత్ రెడ్డి ఇటీవల ఫోన్ చేసి దిగజారుడు మాటలు మాట్లాడారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.