Today Headlines: హైదరాబాద్‌లో ఫేక్ మెడిసిన్ ముఠా గుట్టురట్టు

నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్ నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్టాక్ విలువ 26 లక్షలు ఉంటుందని తేల్చారు.

Today Headlines in Telugu at 11PM

నకిలీ మందులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఉత్తరాఖండ్‌ నుండి తెలంగాణ రాష్ట్రంలోకి నకిలీ మెడిసిన్ డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్ నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. 26 లక్షల విలువైన స్టాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాకాన్ కొరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొరియర్ షిప్పింగ్ కంపెనీ ద్వారా హైదరాబాద్‌కు నకిలీ డ్రగ్స్ రవాణ చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్‌లోని కొరియర్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.

వైసీపీ పాలనలో బాగుపడింది ఆ నలుగురు రెడ్లే..
కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు చంద్రబాబు. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175 స్థానాలు మనవే అని చెప్పారు. మీ దాడులకు భయపడను. మీరు తిన్నది కక్కిస్తాను అని జగన్ పై విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం ఎక్కడ చేశావు అని నిలదీశారు. వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీర నెయ్యి చందం అన్నారు చంద్రబాబు. రెడ్లు ఎవరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు అని విమర్శించారు. మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు మారాల్సింది సీఎం మాత్రమే అని అన్నారు.

వైసీపీలో పాలనలో కుప్పం నాశనమైంది-చంద్రబాబు
కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో చంద్రబాబు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో కుప్పం ఎంతో అభివృద్ధి సాధించిందని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంపై శీతకన్నేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో కుప్పం సర్వనాశనం అయిందన్నారు. గూండాయిజం, భూకబ్జాలు, గ్రానైట్ అక్రమ దందాలు తప్ప కుప్పంకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. కుప్పం అంటే మీకెందుకంత పగ? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ ఫిలింనగర్‌లో డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ ఫిలింనగర్‌లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న బాబుకిరణ్ అనే క్యాబ్ డ్రైవర్‌ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పబ్‌కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలో దిగాయి.

జనసేనతో పొత్తులో ఉన్నాం: పురేందేశ్వరి
తాము జనసేనతో పొత్తులో ఉన్నామని, పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. శుక్రవారం కాకినాడలో పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. తాను ఫలానా చోట పోటీ చేస్తానని అడగలేదని.. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్

జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే ఇంజనీర్లు అన్ని వివరాలు తెలిపారు.

కుట్ర పన్నారు: బీటెక్ రవి

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ, కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి పలు ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారని చెప్పారు. ఇందులో భాగంగానే గన్‌మన్లను తొలగించారని అన్నారు. ‘బీటెక్ రవికి ఏదైనా జరిగితే బాధ్యత నాదే’ అని జగన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

బ్యారేజ్‌‌లను పరిశీలించిన మంత్రులు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌ను ఇవాళ తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రాజెక్టులను పరిశీలించారు.

వైసీపీలో సీట్ల కసరత్తుపై లోకేశ్ కామెంట్స్
వైసీపీలో జరుగుతున్న సీట్ల కసరత్తుపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఓడిపోయే అవకాశాలు ఉన్న సీట్లను వైసీపీ బీసీలకు ఇస్తుందని చెప్పారు.

ఇంటర్ కాలేజ్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ శివారులోని ఫీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థిని వర్ష బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. నిన్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడంతో గత రాత్రి నుంచి కాలేజ్ వద్ద ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. తమ కూతురి మృతిపై నిజాలు తేలాలని అంటున్నారు.

భీమవరంలో జగన్‌ 
ఏపీ సీఎం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు. విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు.

26న ట్రాక్టర్లతో పరేడ్‌ 

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జనవరి 26న ట్రాక్టర్లతో పరేడ్‌ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. న్యూ ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ముగిశాక ట్రాక్టర్‌ ర్యాలీ ఉంటుందని ఓ ప్రకటనలో చెప్పారు.

రేపటి నుంచి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు
అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు రేపటి నుంచి నడవనున్నాయి. మాల్దా-బెంగళూరు మధ్య నడిచే రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తుని, రాజమండ్రి, విజయవాడ, చీరాల, నెల్లూరు, రేణిగుంటల మీదుగా వెళ్తుంది.

పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.58,500గా ఉండగా రూ.400 పెరిగి ఇవాళ రూ.58,900గా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.63,820గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటలనాటికి రూ.64,250గా ఉంది.