ఆస్ట్రేలియాపై భారత్ భారీ విజయం
తొలి టీ20లో ఆస్ట్రేలియా మహిళల జట్టుపై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 142 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. షఫాలీ వర్మ (64), స్మృతీ మంధాన(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 3 మ్యాచుల టీ20 సిరీస్ లో భారత్ 1-0తో లీడ్ లో ఉంది.
నేను టీడీపీ ఓనర్ ని కాదు..
టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీ చేస్తా. కచ్చితంగా మూడవసారి గెలుస్తా అని తేల్చి చెప్పారు. తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు, నేను వెళ్లడం లేదు అని తెలిపారాయన. అధినేత చెప్పిన మాటను రామభక్త హనుమలాగా శిరసావహిస్తాను అని స్పష్టం చేశారు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు, అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు అని నాని అన్నారు. నేను టీడీపీ పార్టీకి ఓనర్ ను కాదన్న కేశినేని నాని చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా అని హాట్ కామెంట్స్ చేశారు. తినబోతూ రుచులెందుకు అని వ్యాఖ్యానించారు.
ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా..
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీసీకి రాజీనామా చేశారు. సీఎం జగన్ నమ్మించి గొంతుకోశారని ఆయన వాపోయారు. సర్వేల పేరుతో టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ”నాకు టికెట్ లేదని బయటకు పంపేశారు. కనీసం జగన్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంతకన్నా అవమానం లేదు. నేను కచ్చితంగా పోటీ చేస్తా. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి నా భార్య, నేను పోటీ చేస్తాం” అని తేల్చి చెప్పారు కాపు రామచంద్రారెడ్డి.
సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగకు 6795 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. రాను పోను అడ్వాన్స్ టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కల్పించనుంది. ప్రత్యేక బస్సులు రేపటి నుంచి 14వ తేదీ వరకు.. మళ్లీ 16 నుంచి 18 వరకు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతికి హైదరాబాద్ కు 1600 బస్సులు, బెంగళూరుకు 250 బస్సులు, చెన్నైకు 40, విజయవాడకు 300, విశాఖపట్నానికి 290, రాజమండ్రికి 230, తిరుపతి 70, ఇతర ముఖ్యమైన ప్రాంతాల నుంచి 790 బస్సులను నడపాలని తిరుగు ప్రయాణాలకు 3225 ప్రత్యేక నడపనుంది.
మా మంత్రులు తల పట్టుకున్నారు..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ గత పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. సెక్రటేరియట్ లో తొమ్మిదేళ్ల ఫైళ్లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయని, మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీశ్ కు లేదన్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ వాళ్లు లక్షల కోట్లు అప్పులు చేసి పోయారని, వాటిని ఎలా తీర్చాలా అని మా మంత్రులు తలపట్టుకున్నారు అని వాపోయారు జగ్గారెడ్డి. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా? అని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్టానికి కేంద్రం ఆర్ధిక సహాయం, వెనుబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని సీతారామన్‌ను కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ఉదయం యూపీఎస్సీ చైర్మన్‌తోనూ భేటీ అయ్యారు.
పైలట్ రోహిత్ రెడ్డి వర్సెస్ మహేందర్ రెడ్డి..
బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో గ్రూప్ విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలను పార్టీ పెద్దలు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
హైదరాబాద్: గోదాంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ గాజులరామారంలోని ఫ్లైవుడ్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైవుడ్ గోదాంలో మంటలు అంటుకోవడంతో పొగ దట్టంగా అలుముకుంది. అగ్ని ప్రమాదం ధాటికి సమీపంలోని భవనాల్లోకి కూడా పొగలు వ్యాపించాయి. భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
పోటీలో ఉంటాను: జితేందర్ రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలమూరు ప్రజలు తనను ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని చెప్పారు. తనకు 2004, 2019 ఎన్నికల్లో సీట్ రాలేదని, అంతేగానీ, ప్రజలు తనను ఎప్పుడూ తిరస్కరించలేదని అన్నారు. ఈ సారి పోటీలో ఉంటానని బీజేపీ అధిష్ఠానాన్ని కోరానని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా తాను బీజేపీ అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. పార్లమెంట్ ఎఫైర్స్ కమిటీ అంగీకరిస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
ఖర్గేను కలిసిన వైఎస్ షర్మిల.. బాధ్యతల అప్పగింతపై చర్చలు
వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాణిక్కం ఠాగూర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అంతకుముందు కేసి వేణుగోపాల్ ను షర్మిల కలిశారు. ఖర్గేను కలిసిన తర్వాత షర్మిల మీడియతో మాట్లాడుతూ.. తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని, బాధ్యతల అప్పగింత అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
కార్యాచరణపై కేశినేని నాని ప్రణాళికలు?
ఎన్నికల వేళ విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో పార్లమెంట్ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తదుపరి కార్యాచరణపై ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నారు.
కేశినేని నానికి టిక్కెట్ ఇవ్వం..
ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్ఠానం. బెజవాడ ఎంపీ టిక్కెట్ ను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. తిరువూరు ఘటన తర్వాత టీడీపీ క్లారిటీ ఇచ్చేసింది.
రూ.400 తగ్గిన బంగారం ధర
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.58,500 గా ఉండగా రూ.400 తగ్గి ఇవాళ రూ.58,100గా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.63,820గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటలనాటికి 440 తగ్గి రూ.63,380గా ఉంది.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి గాయాలు
నెల్లూరు: టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గత అర్ధరాత్రి విజయవాడ నుంచి నెల్లూరుకు ఆయన వస్తుండగా దగదర్తి వద్ద కారు ప్రమాదం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి కారు డివైడర్‌ను ఢీకొని ఆయన పీఏ వెంకటేశ్వర్లు మృతి చెందారు. చంద్రశేఖర్ రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి.
హైటెక్ 24×7 కవచ్
రామజన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం భద్రత కోసం హైటెక్ 24×7 కవచ్ ను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి ఏళ్లపాటు ఉండే ఆలయంలో అత్యంత అధునాతనమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంపై దాడులు, చొరబాట్లను అరికట్టేందుకు వీలుగా రూ.90 కోట్లతో ఫూల్ ప్రూఫ్ భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఆలయంలో భద్రతా పరికరాలను అమర్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, మరికొన్ని రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని డీజీ పేర్కొన్నారు.