Today Headlines: తిరుమలలో మరోసారి డ్రోన్‌ కలకలం

కేశినేని నాని కబ్జాలు చేశారు. కేశినేని నానికి ఓటమి భయం మొదలైంది, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

తిరుమలలో మరోసారి డ్రోన్‌ కలకలం
తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. ఘాట్‌ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో ఇద్దరు వ్యక్తులు తిరుమల కొండలను వీడియో తీసేందుకు ప్రయత్నించారు. వీరిని అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద తమ వ్యక్తిగత డ్రోన్‌తో చిత్రీకరిస్తుండగా.. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చంద్రబాబు పోటీ చేసినా.. గెలుపు నాదే- మంత్రి జోగి రమేశ్
పెనమలూరు నియోజకవర్గంలో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు తనదేనని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. పెడనలో తన సిట్టింగ్ స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. జగన్ ఏది చెపితే అది చేయడానికి తాను సిద్ధమన్నారు. 2009లో పెడన నుంచి పోటీ చేశానని.. 2014లో మైలవరం నుంచి తనను జగన్ పోటీ చేయించారని, అప్పుడు ఓడిపోయానని చెప్పారు. ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గానికి పంపుతున్నారని.. అక్కడ కచ్చితంగా గెలుస్తానని జోగి రమేశ్ అన్నారు.

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in లో అందుబాటులో ఉంచింది. టీ.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ / సభ్యుల పదవులకు అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉన్నాయి. అర్హులైన వారు 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

టీడీపీకి రాయపాటి గుడ్ బై.. చంద్రబాబుకు రాజీనామా లేఖ
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి పదవిని ఆయన వదులుకున్నారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపించారు. రంగబాబు అధికార వైసీపీలో చేరతారని సమాచారం.

మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది- మంత్రి జయరామ్
కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు గుమ్మనూరు జయరాం. ఎంపీగా వెళ్లాలా? లేదా? అన్నది కార్యకర్తలే తేల్చాలని అన్నారాయన.

పార్టీ నన్ను మోసం చేసింది- ఎమ్మెల్యే ఎలీజా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. వైసీపీ అధిష్టానం తనను మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టిందని ఆరోపించారాయన. వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చెప్పిన పనులు మాత్రమే చేశానని, తన పనితీరు ప్రజలకు నచ్చినా.. పెత్తందారులకు నచ్చలేదన్నారు. అందుకే తనకు సీటు రాకుండా చేశారని వాపోయారు ఎలీజా.

కేశినేని నాని ఓ చీటర్- బుద్ధా వెంకన్న
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఓ చీటర్ అని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. కేశినేని నాని అవినీతిపరుడు, నిరూపించడానికి మేం సిద్ధం అని చెప్పారు. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎంత..? తిరిగి చెల్లించింది ఎంత..? తాను తీసుకున్న బ్యాంకు అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అని బుద్ధా వెంకన్న నిలదీశారు.

చంద్రబాబు విజయవాడ ద్రోహి- కేశినేని నాని
”లోకేశ్ ను సీఎం చేయడమే చంద్రబాబు ఎజెండా. విజయవాడను స్మశానంలా, హైదరాబాద్ ను బస్తీలా తయారు చేయాలనుకున్నారు. విజయవాడ అంటే చంద్రబాబుకి చిన్న చూపు. అప్పుడెప్పుడో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో విజయవాడలో ట్యాక్సీ డ్రైవర్ అవమానించారట. ఈ విషయం చాలాసార్లు మాతో చెప్పారు. గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం. నేను రాజధానికి వ్యతిరేకం కాదు” అని విజయవాడ ఎంపీ కేశినేనా నాని అన్నారు.

బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై వీగిపోయిన అవిశ్వాసం
మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో ఛైర్‌పర్సన్‌గా జక్కుల శ్వేత, వైస్ ఛైర్మన్‌గా బత్తుల సుదర్శన్ కొనసాగనున్నారు. అవిశ్వాస సమావేశానికి 20 మంది కౌన్సిల్లర్లు హాజరయ్యారు. కొన్ని రోజుల క్రితమే జక్కుల శ్వేత కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

అందులో తప్పేముంది?: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విజయ కేతనం ఎగర వేస్తారని అన్నారు. ఎమ్మెల్యే మార్పుపై ఎప్పుటినుంచో చెప్పుకు వస్తున్నారని తెలిపారు. ఎవరు సక్రమంగా పని చేయరో వారిని మార్చుతున్నారని, అందులో తప్పేముందని నిలదీశారు.

మిషన్ భగీరథ పెద్ద స్కాం, కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్: జీవన్ రెడ్డి
కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అని, కేవలం కమీషన్ల కోసం రీ డిజైన్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని, మిషన్ భగీరథ పెద్ద స్కాం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్ గా మార్చి నిధులను మళ్లించిందన్నారు. నిధుల దారి మళ్ళింపు గురించి చర్చ రాకుండా చేసేందుకు దళితబంధును తెరపైకి తెచ్చారని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదని, ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేరని విమర్శించారు.

పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్న కొణతాల
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సమావేశం కానున్నారు. ఏపీలోని అనకాపల్లిలో తన మద్దతుదారులు, అనుచరులతో కొణతాల సమావేశం ఏర్పాటు చేసి తన తదుపరి కార్యాచరణపై చర్చించారు. కొణతాల అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారు.

నేను దౌర్జన్యాలు చేయలేదు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ తన పోటీపై మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. అమరావతిలో 10 టీవీతో పార్థసారథి మాట్లాడుతూ… ‘నేను దౌర్జన్యాలు చేయలేదు, బెదిరింపులు చేయలేదు అందుకే నాకు సీటునిరాకరించారేమో. అధిష్ఠానం ఎందుకు సీటు నిరాకరించిందో నాకు తెలియదు. ముఖ్యమంత్రి దగ్గరికి ఒకసారి వెళ్లి వచ్చాను. అనేక విషయాలు మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల మీదే నేను ఆధారపడి ఉన్నాను. నా భవిష్యత్ కార్యాచరణను పెనమలూరు నియోజకవర్గ ప్రజలే తేలుస్తారు’ అని అన్నారు.

హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్
అమరావతి: సంక్రాంతికి పండుగకు ఊరెళ్లేందుకు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఆయనపై 11 కేసులు పెట్టారని రఘురామ తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్నారు. మరోసారి అరెస్టు చేసే అవకాశముందని.. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

టీఎంసీ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రితోపాటు పలువురి ఇళ్లపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. 2014, 2018 మధ్య పలు పౌర సంస్థల్లో జరిగిన మునిసిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రదేశాల్లో సోదాలు జరిపింది. బెంగాల్ ఫైర్ సర్వీసెస్ మంత్రి సుజిత్ బోస్‌కు సంబంధించిన రెండు ఇళ్లు, తృణమూల్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది.

15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి
దేశంలోని 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు ప్రబలుతున్నాయి. 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదైనప్పటికీ, కొవిడ్ సబ్ వేరియంట్ సోకిన వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారని వైద్యాధికారులు చెప్పారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరింది. దేశంలోని 15 రాష్ట్రాల్లో 923 కేసులు నమోదు అయ్యాయి.

బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గుదల
బంగారం ధరలు నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం రూ.100 తగ్గి ధర రూ.57,600గా ఉంది.

హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మృతి
లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ పంజాబ్ ప్రావిన్సులో పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలో ఉన్నపుడు గత ఏడాది మే నెలలో గుండెపోటుతో మరణించాడని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరించింది. భుట్టవీ హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా పనిచేశారు.