సుప్రీంకోర్టు తీర్పు పాక్షిక విజయం- నక్కా ఆనంద్ బాబు
వ్యవస్థలపైన టీడీపీకి పూర్తి నమ్మకం ఉందన్నారు మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును పాక్షిక విజయంగా భావిస్తున్నామన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి టీడీపీకి పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, తీర్పు ఆలస్యం కావొచ్చు కానీ, కచ్చితంగా న్యాయం లభిస్తుందన్నారు.
ప్రధాని మోదీకి సీఎం జగన్ కృతజ్ఞతలు
ఏపీలోని సత్యసాయి జిల్లాలో నాసిన్ అకాడెమీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ”అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటైన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్, ఒక వరల్డ్ క్లాస్ అకాడెమీ రావడం ఆనందకరం. నాసిన్ లాంటి సంస్థ మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ పెంచుతుంది. నాసిన్ తో ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది” అని జగన్ అన్నారు.
మంత్రి అంబటి సెటైరికల్ ట్వీట్
చంద్రబాబుపై సెటైర్ వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. నేరస్తుడిని ఏ న్యాయస్థానం కూడా కాపాడదు అని ట్వీట్ చేశారు. నేరస్తుడిని అనే పదానికి కోట్స్ పెట్టి మరీ ట్వీట్ చేశారాయన. ఆ ట్వీట్ ను చంద్రబాబుకు అటాచ్ చేశారు. చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై అంబటి ఈ ట్వీ్ట్ చేశారు.
చంద్రబాబు తప్పించుకునే పరిస్థితి లేదు
స్కిల్ కేసులో చంద్రబాబు తప్పించుకునే పరిస్థితి లేదన్నారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సుప్రీంకోర్టు హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఓ సెక్షన్ మీడియా, రాజకీయ నాయకులు చేస్తున్న దుష్ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపదెబ్బ, గొడ్డలి పెట్టు అని చెప్పారు.
గొర్రెల స్కామ్‌పై ఏసీబీ విచారణ
పశుసంవర్ధక శాఖలో గొర్రెపిల్లల స్కామ్ కేసులో దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నలుగురిపై కేసు నమోదైంది. మొత్తం 2కోట్ల 10లక్షల రూపాయలు తప్పుడు ఖాతాల్లోకి మళ్లించినట్లుగా దర్యాఫ్తు అధికారులు గుర్తించారు. అటు నాంపల్లి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
లేపాక్షి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు
ఏపీ పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మధ్యాహ్నం పుట్టపర్తి ఎయిర్ పోర్టులో ప్రధానికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ లేపాక్షికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మోదీ స్వయంగా హారతిపట్టారు. అనంతరం అర్చకులు ప్రధానికి తీర్థప్రసాదాలు అందజేశారు.
తమ్మినేని వీరభద్రంకు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం ప్రయివేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
సుప్రీం కీలక తీర్పు..
ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయం చెంతనున్న షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు బ్రేక్ పడింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జైపాల్ రెడ్డికి ఘన నివాళి..
కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి స్ఫూర్తి స్థల్ వద్ద పూలుఉంచి నివాళులర్పించారు. తెలంగాణ ఏర్పాటుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీలను ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు.
22న మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ..
రామమందిర ప్రాణప్రతిష్ఠ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్టు వెల్లడించింది. నేటి నుంచి బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈనెల 18న అయోధ్య గర్భగుడిలోకి రాముడి విగ్రహం చేరుకుంటుంది. ఈనెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణప్రతిష్ట. 22న మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తికానున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ప్రాణప్రతిష్ఠ క్రతువు 212 మంది ఆచార్యులు నిర్వహించనున్నారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించనున్నారు. గనేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఆచార వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ గవర్నర్, సీఎం, మోహన్ భగవత్ సమక్షంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈనెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
భూప్రకంపనలు ..
జమ్ముకశ్మీర్ కిష్ట్వర్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3.6గా నమోదైంది.
కమ్మేసిన పొగమంచు ..
తెలంగాణలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు పొగమంచు కారణంగా నెమ్మదిగా కదులుతున్నాయి.
ప్రధాని పర్యటన..
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ.541కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాలు అకాడమీ (నాసిన్) ఇక్కడ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన ప్రత్యేక భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
సీఎం జగన్ పర్యటన ..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్) ను సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన లో సీఎం జగన్ తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది.
విమానాలను కూల్చివేత ..
రష్యాకు చెందిన రెండు కమాండ్ విమానాలను ఉక్రెయిన్ కూల్చివేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ వలెరీ జులుజ్నీ తెలిపారు. ఉక్రెయిన్ కూల్చిన ఏ-50 రాడార్ డిటెక్షన్ విమానం, ఐఎల్ -22 కంట్రోల్ సెంటర్ విమానం రష్యా వైమానిక దళంలో అత్యంత విలువైనవిగా భావిస్తారు. అజోవ్ సుమద్రం మీదుగా వెళ్తున్న ఈ రెండు విమానాలను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.