11PM Headlines
రేపు లేదా ఎల్లుండి వైసీపీ ధర్డ్ లిస్ట్..
వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో లిస్టు ప్రకటనను వాయిదా వేసింది వైసీపీ అధిష్టానం. మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో లిస్టు విడుదలను వాయిదా వేశారు. రేపు లేదా ఎల్లుండి వైసీపీ మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీటీడీలో నాసిరకం భోజనం పెడుతున్నారు: చంద్రబాబు
కాకినాడ జిల్లా తునిలో రా కదిలి రా బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మళ్లీ జగన్ గెలిస్తే మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టుకుంటారు అని చంద్రబాబు హెచ్చరించారు. ‘మీ బలహీనతను తెలుసుకుని కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చారు. అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ పెడతాను. టీటీడీలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు’ అని అన్నారు.
టీడీపీకి బై బై..
టీడీపీ సభ్యత్వానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన పంపారు. ఇంతకు ముందు కేశినేని నాని లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ పంపారు.
జగన్ నిర్ణయిస్తారు: గుడివాడ అమర్నాథ్
సీఎం జగన్‌తో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెలలో కర్నూలులో రూ.2,500 కోట్లతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనపై చర్చించానని అన్నారు. సీట్ల మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని వ్యాఖ్యానించారు. తన భవిష్యత్తును జగన్ నిర్ణయిస్తారని, తనకు ఎలాంటి ఆందోళన లేదని అన్నారు.
కేశినేని నానికి బుద్ధా వెంకన్న కౌంటర్
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. ఇవాళ్టి నుంచి ఆట మొదలైంది, నీకు సినిమా చూపిస్తా అంటూ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బుద్ధా వెంకన్న. సీఎం జగన్ ను కలిశాక చంద్రబాబును ఉద్దేశించి మోసగాడు అంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడు అని మండిపడ్డారు. చంద్రబాబు రెండుసార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని గుర్తు చేశారు.
వాహనదారులకు ఊరట.. రాయితీ చలాన్ల గడువు పొడిగింపు
వాహనదారులు రాయితీతో పెండింగ్ చలాన్లు కట్టేందుకు విధించిన గడువును తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది. ముందుగా విధించిన గడువు నేటితో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పొడిగింపు ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో పెండింగ్ చలాన్లు చెల్లిస్తే 50 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం పెండింగ్ చాలన్లు 3 కోట్ల 9 లక్షలు ఉండగా.. ఇప్పటివరకు 1 కోటి 7 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. దీంతో ప్రభుత్వానికి 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
అవమానాలు ఎదుర్కొన్నాను..
సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని విజయవాడ కేశినేని నాని అన్నారు. టీడీపీ కోసం తాను ఆస్తులు అమ్ముకున్నానని, అయినప్పటికీ పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. సీఎం జగన్‌ను కలిశాక కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసగాడని ప్రపంచానికి తెలుసు’ అని అన్నారు.
లోకేశ్‌పై కేశినేని ఫైర్
‘పాదయాత్ర చేయడానికి లోకేశ్‌కు అర్హత ఉందా? లోకేశ్‌కు నేను జీహుజూర్ అనాలా? లోకేశ్ మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు.. లోకేశ్ కి ఏం అర్హత ఉంది పాదయాత్ర చెయ్యడానికి.. లోకేశ్ ఆప్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యే.. నేను ఎందుకు పాల్గొనాలి? పార్టీ కోసం లోకేశ్ ఏం చేశాడు.. ఆయనకి ఏం రైట్ ఉంది? జగన్ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తా.. NTR జిల్లాలో 60 శాతం టిడిపి కాళీ అవ్వబోతుంది..నాతో పాటు జగన్ వెంట వస్తారు.. ఎంపీగా పోటీ అవకాశం ఇస్తారా? లేకా పార్టీ చుసుకోమంటారా? లేక ఖాళీగా ఉండమంటారా జగన్ ఇష్టం’ అని చెప్పారు.
త్వరలో రాజీనామా..
వైసీపీ తీరుపై ఆ పార్టీ నేత, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మండిపడ్డారు. అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి మొదటి వారంలో తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో గడిచిన నాలుగునరేళ్లుగా అనుకున్న విధంగా అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు. నాలుగేళ్లలో రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు వివరించే అవకాశం వచ్చిందని విమర్శించారు.
రాజీనామాలకు ఆమోదం..
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. గత నెలలో చైర్మన్, ఐదుగురు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అదానీ కీలక ప్రకటన..
అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్‌లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్‌లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా తెలిపారు. గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు.
భూకంపం ..
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
పట్టాలు తప్పిన రైలు ..
నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. కొంతమందికి హార్ట్ ఎటాక్ రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఢిల్లీకి రేవంత్ ..
హైకమాండ్ పిలుపుతో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చించనున్నారు.
ప్రాన్స్ నూతన ప్రధాని ..
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి మంగళవారం అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆమోదం తెలిపారు. దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతిపిన్న వయస్సుడైన ప్రధానిగా అట్టల్ చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. ఆయన స్వలింగ సంపర్కుడు కూడా. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోర్న్ సోమవారం రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో గాబ్రియేల్ అట్టల్ నిమితులయ్యారు.
జులై 7న నీట్ పీజీ పరీక్ష..
నీట్ పీజీ పరీక్ష జులై 7వ తేదీన జరగనుంది. మార్చి 3వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను జులై 7వ తేదీకి రీ షెడ్యూల్ చేస్తున్నట్లు మెడికల్ సైన్సెస్ జాతీయ పరీక్ష బోర్డు (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. ఈ పరీక్ష రాసే అర్హత కటాఫ్ తేదీని ఆగస్టు 15గా వెల్లడించింది. పీజీ వైద్యవిద్య నిబంధనలు -2023 ప్రకారం ఈ పరీక్ష జరగనుంది.