Today Headlines: నారా లోకేశ్‌కు కానుకలు పంపిన సీఎం జగన్ సోదరి.. 6 గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డే అర్హత

ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపోయారు. ప్రజలు బాగుండాలనే యజ్ఞాలు చేశానని ఆయన చెప్పారు.

Today Headlines in Telugu at 11PM

లోకేశ్‌కు షర్మిల క్రిస్మస్ కానుక
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ షర్మిల. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ స్పెషల్ గిఫ్టులు కూడా పంపించారు. “వైఎస్ఆర్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి” అంటూ మేసేజ్ పంపారు షర్మిల. దాంతో షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు లోకేశ్. అలాగే క్రిస్మస్ విషెస్ కూడా తెలిపారు.

 

తెల్లరేషన్ కార్డే అర్హత: పొంగులేటి

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు పొందాలంటే అర్హత ఏంటన్న విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరాలు తెలిపారు. తాము అమలు చేసే 6 గ్యారంటీలకు తెల్లరేషన్‌ కార్డే అర్హతని చెప్పారు.

ఘోర రోడ్డు ప్రమాదం

నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ మండలం జక్లేర్‌లో 167 జాతీయ రహదారి జక్లేర్ వద్ద ఎదురుగా వచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీ కొన్నాయి.

ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది: చంద్రబాబు

ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు బాగుండాలనే యజ్ఞాలు చేశానని ఆయన చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉంటే తాను అక్కడ ఉంటానని తెలిపారు. 40 ఏళ్ల అనుభవంతో తాను కష్టపడతానని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చుతానని అన్నారు.

ఆస్ట్రేలియా జట్టుపై విజయం..
టెస్టు క్రికెట్ చరిత్రలో ఆసీస్ పై తొలిసారి భారత మహిళల జట్టు విజయం సాధించింది. ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియా జయకేతనం ఎగరేసింది. ముంబయిలోని వాఖండే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ను భారత్ 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దీంతో ఆసీస్ తో తలపడిన 11 టెస్టుల్లో టీమిండియాకు ఇదే తొలి విజయం.

28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన ..
ఈనెల 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.

శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు..
శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివెళ్తున్నారు. ఎరుమేలికి నాలుగు కిలో మీటర్ల ముందే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో తెల్లవారు జామునుంచి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు.

తొలి సమావేశం..
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ప్రజాపాలన , ఆరు గ్యారంటీల అమలు, క్షేత్ర స్థాయి అంశాలపై చర్చించారు.

మావోల ఘాతుకం..
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ లో జవాన్ ను మావోయిస్టులు హత్యచేశారు. మృతదేహాన్ని గోర్నా రోడ్డుపై పడేశారు. రాత్రి మంకెలి గ్రామానికి చెందిన జవాన్ ఛోటూ కుర్సామ్ ను కిడ్నాప్ చేసిన మావోలు ప్రజాకోర్టు నిర్వహించి హత్యచేశారు.

స్టీల్ ప్లాంట్ నిర్మించండి..
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ప్లాంట్ నిర్మాణానికి 2019, 2023 లో రెండు సార్లు భూమిపూజ చేశారని, ప్లాంట్ నిర్మించి 25వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.

వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళి ..
సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని నివాసం నుంచి వైఎస్సాఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకొని ప్రార్థనల్లో పాల్గోనున్నారు.

తెలంగాణకు ఉపరాష్ట్రపతి ..
ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్కర్ ఈనెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఆయన రాక దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ సమావేశం..
పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు 100రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రజాపాలన పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం అమలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించనుంది. దీనిపై కూలంకుషంగా చర్చించేందుకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయం ఏడో అంతస్తులోని డోమ్ సమావేశ మందిరంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు సదస్సు జరగనుంది.

కరోనా కేసులు..
రాష్ట్రంలో శనివారం కొత్తగా 12 కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1322 మందికి పరీక్షలు నిర్వహించారు. వీటిలో హైదరాబాద్ తొమ్మిది, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. మరో 30 మంది నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా నుంచి ఒక వ్యక్తి కోలుకోగా, 38 మంది ఐసోలేషన్ లో ఉన్నారు.